iDreamPost
android-app
ios-app

Rajnath Singh, Bipin’s funeral – ప్రమాదంపై రక్షణ మంత్రి ప్రకటన.. రేపు బిపిన్‌ అంత్యక్రియలు..

Rajnath Singh, Bipin’s funeral – ప్రమాదంపై  రక్షణ మంత్రి ప్రకటన.. రేపు బిపిన్‌ అంత్యక్రియలు..

తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలో ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రకటన చేశారు. ప్రమాదవశాత్తూ ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోయిందని తెలిపారు. మధ్యాహ్నం 12.08 గంటలకు హెలికాప్టర్‌ నుంచి సిగ్నల్స్‌ కట్‌ అయ్యాయని చెప్పారు. కొద్దిసేపటికే హెలికాప్టర్‌ కూలిపోయిందని వెల్లడించారు. హెలికాప్టర్‌ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని చెప్పారు. వారు వెళ్లే సరికి హెలికాప్టర్‌ మంటల్లో కాలిపోతోందన్నారు.

గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారని చెప్పారు. సీడీఎస్‌ బిపిన్‌రావత్‌ ఆయన సతీమణి చనిపోవడం బాధాకరమన్నారు. రేపు బిపిన్‌ దంపతుల భౌతిక కాయాలు ఢిల్లీ చేరతాయని, సాయంత్రం అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. సైనికులు మృతికి పార్లమెంట్‌ తీవ్ర సంతాపం తెలిపింది. సభ్యులు అందరూ లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు.

ప్రమాదంలో కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఒక్కరే ప్రాణాలతో మిగిలారని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆయనకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వరుణ్‌ సింగ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రమాద ఘటనపై ఎయిర్‌ మార్షల్‌ మన్వేంద్రసింగ్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోందని చెప్పారు. కాగా, వరుణ్‌ సింగ్‌ శరీరం పూర్తిగా కాలిపోయింది. చికిత్సకు ఆయన శరీరం సహకరించడంలేదని సమాచారం.

Also Read : హెలికాప్టర్ మృతుల్లో తెలుగు అధికారి, మదనపల్లిలో విషాదం

వెల్లింగ్టన్‌ మద్రాస్‌ రెజిమెంటల్‌లో భౌతిక కాయాలు..

వెల్లింగ్టన్‌ సైనిక ఆస్పత్రిలో ఉన్న 13 మంది భౌతిక కాయాలను వెల్లింగ్టన్‌ మద్రాస్‌ రెజిమెంటల్‌కు తరలించారు. అక్కడ వారందరికి నివాళులర్పిస్తున్నారు. సైనికులు, ఆర్మీ అధికారులు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ బిపిన్‌ రావత్‌ సహా ఇతర జవాన్లకు నివాళులర్పించారు.

అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భౌతికకాయాలు సూలూరు బేస్‌ క్యాంపునకు చేర్చుతారు. అక్కడ నుంచి సాయంత్రం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి బిపిన్‌ రావత్‌ దంపతుల భౌతికకాయాలు తరలిస్తారు. రేపు శుక్రవారం బిపిన్‌ స్వగృహంలో భౌతికకాయాలను ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. సాయంత్రం నాలుగు గంటలకు కామరాజ్‌ మార్క్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్  శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించి, అంత్యక్రియలు జరపనున్నారు.

కాగా, ప్రమాద స్థలిని ఆర్మీ చీఫ్‌ వి.ఆర్‌. చౌదరి తమిళనాడు డీజీపీతో కలసి పరిశీలించారు. విచారణలో కీలకంగా భావిస్తున్న బ్లాక్‌ బాక్స్‌ దొరికింది. ప్రమాద స్థలికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు గుర్తించారు. దానిలోని సమాచారాన్ని విశ్లేషించేందుకు ఢిల్లీకి పంపారు. పైలెట్ల మాటలను రికార్డు చేసే బ్లాక్‌ బాక్స్‌ ద్వారా ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Also Read : రావత్ కంటే ముందు హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే!