iDreamPost
android-app
ios-app

రాజీవ్‌, మ‌హంత‌ …ఒక యూనివ‌ర్సిటీ జ్ఞాప‌కం

రాజీవ్‌, మ‌హంత‌ …ఒక యూనివ‌ర్సిటీ జ్ఞాప‌కం

1985, SK యూనివ‌ర్సిటీ అనంత‌పురంలో తెలుగులో MA చ‌దువుతున్న రోజులు. ఇద్ద‌రు నాయ‌కులు ప్రేర‌ణ‌గా ఉండేవారు. రాజీవ్‌గాంధీ, ప్ర‌పుల్ల‌కుమార్ మ‌హంత.

రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేక‌పోయినా త‌ల్లి కోసం రాజీవ్ వ‌చ్చాడు. హ‌ఠాత్తుగా జ‌రిగిన ఇందిర హ‌త్యతో ప్ర‌ధాని అయ్యాడు. చిన్న వ‌య‌సులో ఇంత పెద్ద దేశానికి ప్ర‌ధాని అయిన ఆయ‌న చాలా చేస్తార‌ని అప్ప‌టి యువ‌కులు ఆశించారు. టెక్నాల‌జీలో ముందు చూపుతో ఎంతో చేశారు కానీ, ఆర్థికంగా చేయ‌లేకపోయారు. ట్రంక్ కాల్ నుంచి క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ని ముందుకు తీసుకెళ్లింది ఆయ‌నే. అయితే అన‌వ‌స‌రంగా శ్రీ‌లంక వ్య‌వ‌హారాల్లో ఇరుక్కున్నారు.

ఇప్పుడు ఆలోచిస్తే రాజీవ్ అంత అమాయ‌కంగా శ్రీ‌లంక ప్ర‌భుత్వాన్ని ఎందుకు న‌మ్మాడా? అనిపిస్తుంది. త‌మ దేశంలో ఆయుధాలు ప‌ట్టుకుని తిర‌గ‌బ‌డుతున్న టైగ‌ర్ల‌తో రాజీప‌డి, ఓ చిన్న ముక్క‌ని వాళ్ల సొంతం చేయ‌డానికి ఏ ప్ర‌భుత్వ‌మూ ఒప్పుకోదు. వాళ్లు చేయాల్సిన యుద్ధాన్ని ఇండియాతో చేయించారు. అమెరికా వియ‌త్నాంలో ఇరుక్కున్న‌ట్టు ఇండియా ఇరుక్కుని సైనికుల్ని బ‌లిచ్చింది.

రాజీవ్ హ‌త్య‌కి ప‌థకం వేసిన ప్రభాక‌ర‌న్ కూడా మూర్ఖుడే. వ్య‌క్తిగ‌త ఇగోతో త‌మిళులంద‌రినీ ప్ర‌మాదంలోకి నెట్టాడు. టైగ‌ర్ల‌కి ఆయుధాలు, డ‌బ్బు, నైతిక మ‌ద్ద‌తు అంతా ఇండియా నుంచే. రాజీవ్ హ‌త్య‌తో ఏ ర‌కమైన సాయం అందదు. అంతమై పోతామ‌ని ఊహించ‌లేనంత అమాయ‌కుడా ప్ర‌భాక‌ర‌న్‌?

ప్ర‌పుల్ల‌కుమార్ అస్సాంలో ఉద్య‌మ నాయ‌కుడు. యూనివ‌ర్సిటీ నుంచి నేరుగా ముఖ్య‌మంత్రి అయిన వ్య‌క్తి. అస్సాంలోనే కాదు, దేశంలో విద్యార్థి ఉద్య‌మాల్లో పాల్గొంటున్న అంద‌రికీ రోల్ మోడ‌ల్‌. కాలం అంద‌రి రంగుని క‌డిగేస్తుంది. చివ‌రికి మ‌హంత భ్ర‌ష్టు ప‌ట్టి సొంత పార్టీలోనే టికెట్ లేకుండా చేసుకున్నాడు. ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తికి పార్టీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డం దేశ చ‌రిత్ర‌లోనే మొద‌టిసారి.

ఒక నాయ‌కుడి ప్రారంభం ఉన్న‌ట్టు ముగింపు ఉండ‌దు. రాజీవ్ అకాల మ‌ర‌ణం పొందితే, మ‌హంత రాజ‌కీయ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌రికి వ‌య‌సు మీద ప‌డిన‌ప్ప‌టికీ, NTR కూడా అప్ప‌టి యువ‌కుల్లో ఆశ‌లు క‌ల్పించాడు. ఆరేళ్ల‌కే న‌మ్మ‌కం పోయి ఓడించారు. తిరుప‌తి కోనేటిక‌ట్ట‌లో 83లో మీటింగ్ పెడితే జ‌న‌స‌ముద్రం. 89లో సీఎం హోదాలో మీటింగ్ పెడితే జ‌నం లేరు. 94లో మ‌ళ్లీ వ‌చ్చినా ఏం జ‌రిగిందో తెలుసు.

80వ ద‌శాబ్దంలో యువ‌కులు ఆశ‌లు పెట్టుకున్న ముగ్గురూ ఈ విధంగా ముగిసిపోవ‌డం విషాదం.