Idream media
Idream media
1975లో రాయదుర్గం ఎమ్మెల్యే గొల్లపల్లి తిప్పేస్వామి గుండెపోటుతో పోయాడు. ఉప ఎన్నికలో పయ్యావుల వెంకటనారాయణ గెలిచాడు. సంజయ్‌గాంధీ పేరు అప్పుడు వినిపించింది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఊరంతా చెప్పుకున్నారు. అప్పటి యూత్ సంజయ్ బ్యాడ్జీ తగిలించుకుని ప్రచారం చేశారు. ఎమర్జీన్సీలో చాలా ఘోరాలు చేశాడని చెప్పుకున్నారు. 80లో సంజయ్ చనిపోయాడు. అప్పటి వరకూ మామూలు జనానికి రాజీవ్‌గాంధీ ఒకడున్నాడని తెలియదు. ఫొటో కూడా చూసిన వాళ్లు లేరు. విమానాలు నడిపే పైలెట్ నుంచి తల్లికి తోడుగా రాజకీయాల్లోకి వచ్చారు.
చిరునవ్వు , సౌమ్యతలతో దేశాన్ని ఆకర్షించాడు. 84లో ఇందిరమ్మ హత్య. దుక్కంతో ప్రధాని అయ్యారు. హేమాహేమీలకు కూడా అర్థం కాని ఈ దేశ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించారు. సిక్కుల ఊచకోతని, ఒక మహావృక్షం రాలినపుడు జరిగే ప్రకంపనలని అనడంతో అపరిపక్వత చాటుకున్నాడు.
విమానం స్పీడ్‌కి అలవాటు పడిన వ్యక్తికి ఎడ్ల బండిలా సాగుతున్న అభివృద్ధి నచ్చలేదు. టెక్నాలజీపైన దృష్టి పెట్టాడు. ఈ రోజు సెల్‌ఫోన్లతో పుట్టిన జనరేషన్‌కి ఒకప్పుడు జనం ట్రంక్ కాల్ కోసం గంటలుగంటలు ఎదురు చూసి వినపడక, గట్టిగా కేకలు పెట్టేవాళ్లని తెలియదు. ప్రతి ఊళ్లో STD బూత్ రావడానికి రాజీవే కారకుడు. కంప్యూటర్లు భవిష్యత్‌ని శాసిస్తాయని మొదట ఊహించింది ఆయనే. ప్రభుత్వ రంగ సంస్థలు తెల్ల ఏనుగులని, ప్రైవేటీకరణ అనివార్యమని గుర్తించి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాలని అనుకున్నారు. ఆ బాధ్యత పీవీ నరసింహారావుకి అప్పగించారు. తర్వాత కాలంలో పీవీ నెరవేర్చారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పీవీ చేసిన సంస్కరణలు మనల్ని మార్చేశాయి. అవి అనివార్యం కూడా. కంప్యూటరీకరణని వ్యతిరేకిస్తూ మన దేశంలో అనేక సంఘాలు సమ్మెలు చేశాయంటే ఇప్పుడు వినడానికే నవ్వులాటగా ఉంటుంది. పాత పద్ధతుల్లో అయితే బ్యాంక్‌కు వెళితే డబ్బు డ్రా చేయడానికి గంటలు పట్టేది. టోకెన్ తీసుకుని పడిగాపులు కాసేవాళ్లు.
రాజీవ్ కల నెరవేరింది. కానీ ఆయన చూడలేక పోయారు. తప్పిదాల వల్ల దిగిపోయారు. ఆయన చేసిన అతిపెద్ద తప్పు టైగర్లని దారిలోకి తేవాలనుకోవడం. అదే బలి తీసుకుంది. విమానం తప్పి పోయి ఆయన బతికి ఉంటే చరిత్ర ఇంకోలా వుండేది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రుల పేర్లు మారి ఉండేవి. 91 మే 21 రాత్రి తిరుపతి గంగజాతర జరుగుతూ వుండగా ఆయన మరణవార్త వచ్చింది. జాతర ఆగిపోయింది. తిరుపతి చరిత్రలో జాతర ఆగిపోవడం అదే మొదలు. ఇప్పుడు కరోనాతో గత ఏడాది నుంచి జరగడం లేదు.
Also Read : భారత రాజకీయాల్లో సంస్కరణల రాజీవం