iDreamPost
android-app
ios-app

ర‌జనీకాంత్ ఓ మెస్మ‌రిజం

ర‌జనీకాంత్ ఓ మెస్మ‌రిజం

1976లో నేను అనంత‌పురం వ‌చ్చే స‌రికి అంతులేని క‌థ సినిమా గౌరీ టాకీస్‌లో ఆడి వెళ్లిపోయింది. దాంతో ర‌జ‌నీకాంత్ ఎవ‌రో తెలియ‌‌లేదు. 1977 ఆగ‌స్టులో శాంతి థియేట‌ర్‌లో చిల‌క‌మ్మ చెప్పింది వ‌చ్చింది. నిజానికి దీంట్లో చూడాల‌నిపించే న‌టులెవ‌రూ లేరు. ఎందుకెళ్లానో గుర్తు లేదు. నారాయ‌ణ‌రావు హీరో, శ్రీ‌ప్రియ హీరోయిన్‌. సంగీత‌ని టీజ్ చేసే కుర్రాడు గిర‌జాల క్రాప్‌తో స్టైల్‌గా ఉన్నాడు. తెర మీద క‌నిపించినంత సేపు మెస్మ‌రిజం. ఆయ‌న సూప‌ర్‌స్టార్ అవుతాడ‌ని, దాదాసాహెబ్ ఫాల్కే అత్యున్న‌త అవార్డు అందుకుంటాడ‌ని ఆ రోజు ఎవ‌రికీ తెలియ‌దు.

1978 జూలైలో నీలం టాకీస్‌లో వ‌య‌సు పిలిచింది వ‌చ్చింది. ర‌జ‌నీకాంత్ మామూలుగా లేడు. క‌మ‌ల్‌హాస‌న్‌ని కూడా డామినేట్ చేశాడు. త‌ర్వాత అంతులేని క‌థ సెకండ్ ర‌న్ వ‌స్తే చూసాను. యాక్ష‌న్ సినిమాలు త‌ప్ప మామూలు సినిమాలు అంత‌గా న‌చ్చ‌ని రోజుల్లో కూడా కేవ‌లం ర‌జ‌నీకాంత్ కోసం రెండుసార్లు చూసాను. అంత‌కు ముందు కృష్ణ‌, ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్‌లో అన్న‌ద‌మ్ముల స‌వాల్ వ‌చ్చింది. కృష్ణ‌తో స‌మాన‌మైన ఫాలోయింగ్ మూడు నాలుగు సినిమాల‌తోనే తెచ్చుకోవ‌డం ర‌జ‌నీ స్పెషాలిటీ.

44 సంవ‌త్స‌రాలుగా ర‌జ‌నీ ఒక్క సినిమా కూడా మిస్ కాలేదు. మంచి పాత్ర‌ల‌న్నీ ఆయ‌న‌కి తొలి రోజుల్లోనే వ‌చ్చాయి. తెలుగులో ఇదో చ‌రిత్ర‌గా డ‌బ్ అయిన సినిమాలో బ్రోక‌ర్‌గా న‌టించాడు. విటుడుగా క‌మ‌ల్‌హాస‌న్‌. వేశ్య‌ల జీవితంపై బాల‌చంద‌ర్ తీసిన ఈ సినిమా క‌న్నీళ్లు పెట్టిస్తుంది. ఎందుకో ఆడ‌లేదు.

సూప‌ర్‌స్టార్ అయిన త‌ర్వాత రొటీన్‌గానే న‌టించాడు. కానీ జ‌నాల‌ని థియేట‌ర్‌కి ర‌ప్పించ‌డంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరిక ఉండేది కానీ, ఆయ‌న బ్యాడ్ ల‌క్ ఏమంటే జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి ఉన్న‌ప్పుడు పొలిటిక‌ల్ వాక్యూమ్ లేదు. అది ఉంటేనే జ‌నం మూడో పార్టీ వైపు చూస్తారు. ఎన్టీఆర్‌కి ఇది క‌లిసొచ్చింది. చిరంజీవి టైంలో కాంగ్రెస్‌, టీడీపీ బ‌లంగా ఉండ‌డంతో అవ‌కాశం లేకుండా పోయింది. ఇపుడు త‌మిళ‌నాడులో రాజ‌కీయ శూన్య‌త ఉంది. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో అన్నాడిఎంకేకి విలువ లేదు. ఆ ప్లేస్‌లో రెండేళ్ల క్రితం ర‌జ‌నీకాంత్ ప్లాన్ చేసి వుండాల్సింది. చివ‌రి నిమిషంలో వెన‌క‌డుగు వేసాడు. అయినా స‌రైన పొలిటిక‌ల్ ఐడియాల‌జీ లేకుండా ఆధ్యాత్మిక రాజ‌కీయాలు అంటూ బీజేపీ నీడ‌లా వ‌స్తే ఆద‌ర‌ణ ఉండేదో కాదో తెలియ‌దు.

అవార్డు రావ‌డం ర‌జ‌నీకే కాదు, అవార్డుకి కూడా గౌర‌వ‌మే.