రాజకీయ తెరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన తమిళ సూపర్ స్టార్ స్పీడు పెంచారు. మూడేళ్ల క్రితమే రాజకీయాలపై ఆసక్తి కనబరిచిన రజనీకాంత్ ఎట్టకేలకు పొలికల్ ఎంట్రీ దిశలో తొలి అడుగు వేశారు. డిసెంబర్ 31న నూతన పార్టీ వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాల్లో ఆకస్తినెలకొంది. వచ్చే ఏడాది తమిళనాట సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజనీకాంత్ పెట్టబోయే పార్టీ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. తాజాగా పార్టీ ఏర్పాటు గురించి మరోమారు తన అభిమానులతో చర్చించిన సూపర్ స్టార్ పార్టీ పేరు, గుర్తు విషయాల్లో క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ఇప్పటికే ప్రకటించిన రజనీకాంత్ అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పార్టీ పేరు రిజిస్టర్ చేయడం కోసం ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయానికి మక్కల్ మన్రం నేతలు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ పేరు, జెండా, గుర్తు పై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన మక్కల్ మన్రం కీలక నేతలు ఎలక్షన్ కమిషన్ వద్ద వాటిని రిజిస్ట్రర్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. మూడు వర్ణాల మేళవంగా జెండాను రూపొందించినట్లు తెలుస్తోంది. నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసి పార్టీని ప్రకటించాలని సూపర్ స్టార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఆయన 71వ జన్మదినం ప్రత్యేకతను సంతరించుకుంది. తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు తలైవా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేసిన నాటినుంచీ తమిళనాట రాజకీయ సమీకరణలపై ఆసక్తికరమైన చర్చజరుగుతోంది. రజనీకాంత్ పెట్టబోయే పార్టీ బీజేపీకి కలిసొచ్చే విషయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రజనీ కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను సమర్థిస్తూ బీజేపీకి మద్దతు ప్రకటించడమే ఈ అభిప్రాయాలకు కారణం.
మరోవైపు రజనీకాంత్ అంగీకరిస్తే… వచ్చే ఎన్నికల్లో ఆపార్టీతో కలిసి పోటీ చేస్తామని అన్నాడీఎంకే నేతలు ఇప్పటికే ప్రకటించారు. మరో తమిళ అగ్రహీరో, మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ సైతం రజనీతో కలిసి పనిచేయడానికి ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఇరువురిదీ 44 ఏళ్ల స్నేహబంధమనీ, అవసరమైతే మెరుగైన తమిళనాడు కోసం తామిద్దరం ఏకమవుతామని కమల్ ఒకానొక సందర్భంగా ప్రకటించారు. ఇలా పార్టీ ఆవిర్భావానికి ముందే రజినీకాంత్ తమిళరాజకీయాల్లో సెంటర్ పాయింట్ మారుతున్నారు. ఎవరి అభిప్రాయాలు ఏవైనప్పటికీ రజనీకాంత్ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగే ఆలోచనలో ఉన్నారు. రజనీకాంత్‌ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ తమిళనాట అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోందని, వచ్చే ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేస్తుందని రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్ ఇప్పటికే ప్రకటించారు.
విద్వేష రాజకీయాల స్థానంలో ఆధ్యాత్మిక రాజకీయాలు ఆరంభించనున్నట్లు తెలిపారు. మొత్తానికి రాజకీయ తెరంగేట్రం విషయంలో స్పీడు పెంచిన రజనీకి రానున్నరోజుల్లో ఎలాంటి ఫలితాలు ఎదురవ్వనున్నాయో చూడాలి మరి.