iDreamPost
android-app
ios-app

రాజేంద్ర‌ప్ర‌సాద్ రిటైరైతే మంచిది

రాజేంద్ర‌ప్ర‌సాద్ రిటైరైతే మంచిది

OTTతో ప్ర‌మాదం ఏమంటే థియేట‌ర్‌లో త‌ప్పించుకుని ఇక్క‌డ దొరికిపోతాం. గాలి సంప‌త్‌ని చూడాల్సి వ‌చ్చింది. రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎంత భ‌య‌పెట్టాడంటే … ఒక‌ప్పుడు ఎంతో అభిమానించింది ఈయ‌న‌నేనా అని అనుమానం వ‌చ్చింది.

ఆట ఎప్పుడు ఆపాలో తెలియాలి. ఇది శోభ‌న్‌బాబు మాట‌. ప్రేక్ష‌కుల‌కి విసుగెత్తుతున్న స‌మ‌యంలో ఆగిపోయాడు. శ్రీ‌రామ‌చం ద్రుడు ఒక అర్ధ‌రాత్రి వ‌శిష్టుడి త‌లుపు త‌డితే “ఎవ‌ర్నువ్వు?” అని త‌లుపు తీయకుండా అడిగాడు.

“అది తెలుసుకోడానికే వ‌చ్చాను” అన్నాడ‌ట రాముడు.దేవుడికే త‌న‌ని తాను తెలుసుకోడానికి సాధ్యం కాలేదు. మ‌నుషులం మ‌న‌మెంత‌? మ‌న‌ల్ని మ‌నం తెలుసుకోవ‌డ‌మే జ్ఞానం. కానీ అదంత సులభం కాదు.

ప్ర‌తిదానికీ ఒక టైం వుంటుంది. దాని గుర్తించ‌డ‌మే ప్రాప్త కాల‌జ్ఞ‌త‌. ఇది తెలియ‌క బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర తీశాడు NTR. ప్రేక్ష‌కులు గేట్లు దూకి పారిపోయారు. చాప్లిన్‌ అంత‌టివాడు న‌వ్వించ‌లేక‌పోయాడు. జ‌నం జ‌డుసుకునే వ‌ర‌కూ తెర మీద క‌నిపించాల‌నుకోవ‌డం అమాయ‌క‌త్వం.

నేను ఇంట‌ర్ చ‌దువుతున్న రోజుల్లో మంచుప‌ల్ల‌కి వ‌చ్చింది. చిరంజీవితో పాటు రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా అంద‌ర్నీ ఆక‌ర్షించాడు. త‌ర్వాత ఆయ‌న సినిమాలు మిత్రులంద‌రం చూసేవాళ్లం. లేడీస్ టైల‌ర్ ఫ‌స్ట్ డే సెకెండ్ షోకి వెళితే రాత్రంతా గుర్తు తెచ్చుకుని న‌వ్వుతూనే ఉన్నా. వంశీ టేకింగ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ కామెడీ, ఆ రోజుల్లో చాలా కొత్త‌. ఇప్ప‌టికీ క‌నీసం పాతిక సార్లు చూసింటా. త‌ర్వాత బోలెడు చూశాను. రాజేంద్ర‌ప్ర‌సాద్ మంచి సినిమాలు, చెత్త‌సినిమాలు కూడా చేశాడు. సినిమా చెత్త‌గా ఉండ‌డానికి కార‌ణాలే వేరే ఉండేవి కానీ, ఆయ‌న న‌ట‌న మాత్రం కాదు.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 40 ఏళ్లు దాటాయి. జ‌నం చూశారు. మెచ్చుకున్నారు. ఇంకా క‌నిపించాల‌నుకోవ‌డం అత్యాశ‌. మొనాట‌నీ వ‌చ్చేసింది. వ‌స్తుంది కూడా, స‌హ‌జం. పాత‌వాళ్లు కొత్త వాళ్ల‌కి దారి ఇవ్వాలి. లేదంటే తోసుకుని వ‌చ్చేస్తారు. 40 ఏళ్ల క్రితం రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా ఇలాగే వ‌చ్చాడు. పెద్ద హీరోలు స్పీడ్‌గా ఉన్న‌పుడు కూడా దారి ఏర్పాటు చేసుకున్నాడు. కాలాన్ని అర్థం చేసుకోవ‌డ‌మే ఫిలాస‌ఫీ. ఇది పుస్త‌కాల్లో ఉండ‌దు. జీవితంలోంచి వెతుక్కోవాలి.

గాలి సంప‌త్ చూస్తే బాధ క‌లిగింది. గోతిలో ప‌డింది ఆయ‌న కాదు, ప్రేక్ష‌కులు. మైమ్‌లో ఏదో స్కిట్ కూడా చేసాడు. టార్బ‌ర్ అమ్మ మొగుడు. అవ‌న్ ఇవ‌న్ (తెలుగులో వాడే వీడు) లో విశాల్ మైమ్ స్కిట్ ఎంత బాగా చేసాడో గుర్తొచ్చింది. గోతిలో ప‌డే పాయింట్ ఒక‌టే కొత్త‌ది. మిగ‌తా సినిమా 1980 నాటిది. అనిల్ రావిపూడి కూడా భ‌య‌పెడితే ఎట్లా? పురావ‌స్తుశాఖ నుంచి లేదా దూర‌ద‌ర్శ‌న్ నుంచి కామెడీ బిట్లు రెంట్‌కి తెచ్చుకున్న‌ట్టుంది. నాట‌కాల‌కి 8 ల‌క్ష‌లు ఇవ్వ‌డ‌మేంటి? దానికి 5 ల‌క్ష‌లు ర‌ఘుబాబుకి డిపాజిట్ చేయ‌డ‌మేంటి? బ్యాంక్ మేనేజ‌ర్ ఎపిసోడ్ అదో ఘోరం. దీనికి తోడు రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌నాట‌ప్పా మూగ‌భాష‌.

ప్రేక్ష‌కులు పారిపోవ‌డం ఏ న‌టుడికైనా బాధాక‌ర‌మే. దీన్నుంచి త‌ప్పించుకున్న వాళ్లు కూడా లేరు. Entry Free పెట్టి Exit కి టికెట్ పెట్టించుకున్న‌వాళ్లు ఎంద‌రో ఉన్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ హాయిగా రిటైరైతే ఆయ‌న‌కి గౌర‌వం. ప్రేక్ష‌కుల‌కి ఆరోగ్యం.