Idream media
Idream media
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య రాజస్థాన్ లో జరిగిన రసవత్తర పోరు.. ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడ ఆగిందో అందరికీ తెలిసిందే. రోజుల తరబడి సాగిన ఆ రాజకీయ కథ చివరకు సుఖాంతమైన విషయం కూడా విదితమే. ఇప్పుడు అదే సీన్ తమిళనాడులో రిపీట్ అవుతోందా..? అంటే అవుననే వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. కాకపోతే అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీలో.. ఇక్కడ అధికార అన్నా డీఎంకేలో. వివాదం మాత్రం అక్కడ.. ఇక్కడా.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్యే.
తమిళనాడు వివాదాలకు కారణాలేంటంటే…
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ మేరకు అన్ని పార్టీలూ అక్కడ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా సీఎం అభ్యర్థిత్వానికి సంబంధించి అన్నా డీఎంకేలో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పళని స్వామికి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మధ్య సీఎం పదవి విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. వచ్చే యేడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలంటూ పన్నీర్ సెల్వం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే సీఎం పళని స్వామికి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పన్నీర్ సెల్వం ఇంట్లో సమావేశం
ఈ వివాదాల క్రమంలో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఇంట్లో శనివారం కొందరు మంత్రులు సమావేశమైనట్లు ఆయా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం మొత్తం రెండు అంశాల చుట్టే తిరిగింది. మొదటిది వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కాగా… రెండోది ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ. సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని పన్నీర్ సెల్వం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు ఓ వర్గం పేర్కొంది. అంతేకాకుండా పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఏకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ పోస్టర్ల వివాదం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదాలు ఎటు దారి తీస్తాయో.. ఎవరు ఎటువంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.