iDreamPost
android-app
ios-app

సీఎల్పీ సమావేశానికి 90 మంది ఎమ్మెల్యేలు.. రాజస్థాన్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ..

సీఎల్పీ సమావేశానికి 90 మంది ఎమ్మెల్యేలు.. రాజస్థాన్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ..

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయ సంక్షోభం దిశగా ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం అశోక్‌ గెహ్లాత్‌పై తిరుగుబావుటా ఎగురువేసిన డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ రాజస్థాన్‌లో రాజకీయ వేడి పుట్టించారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న చెబుతున్న ఈ యువనేత నిన్న ఢిల్లీలో రాజకీయ మంతనాలు జరపడంతో రాష్ట్రంలో ప్రభుత్వం కూలడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తన బలం నిరూపించుకునేందుకు సిద్ధమైంది. ఈ రోజు సీఎం అశోక్‌ గెహ్లాత్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి 90 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 200 సీట్లు ఉన్న రాజస్థాన్‌లో ప్రభుత్వం నిలబడేందుకు 101 ఎమ్మెల్యేల మద్ధతు అవసరం. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

అంతకు ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అందరూ సీఎల్పీ మీటింగ్‌కు హాజరు కావాలని ఆ పార్టీ సీనియర్‌ నేత రణదీప్‌ సుర్జేవాలా ఎమ్మెల్యేలను కోరారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన కోరారు. పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌ తిరుగుబావుటా ఎగురువేయడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ చర్యలు ప్రారంభించింది. పీసీసీకి నూతన అధ్యక్షుడుని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సీనియర్‌ నేత రఘువీర్‌ మీనాను నూతన పీసీసీ ఛీప్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉంది.

నిన్న రాత్రి అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో ఆయనకు మద్ధతు ఇచ్చే ఎమ్మెల్యేలు అందరూ హాజరైనట్లు ఆ పార్టీ నేత పాండె తెలిపారు. అశోక్‌ గెహ్లాత్‌కు మద్ధతుగా 109 మంది సంతకాలు చేశారని ఆయన తెలిపారు. మరో నలుగురు కూడా మద్ధతు ఇస్తామని సీఎంతో చెప్పినట్లు పాండే పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమావేశానికి 90 మంది ఎమ్మెల్యేలే హాజరు కావడం విశేషం.

2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 200 సీట్లకు గాను 107 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 72 సీట్లకు పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 ఎమ్మెల్యేలు అవసరం కాగా కాంగ్రెస్‌కు ఆరు సీట్లు అదనంగానే ఉన్నాయి. అయితే ఆ పార్టీ బీటీపీ(2), సీపీఐ(ఎం) (2), ఆర్‌ఎల్‌డీ (1), స్వతంత్రులు 12 మంది తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీతోపాటు ఆర్‌ఎల్‌పీ(3), ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నారు. 

124 మంది ఎమ్మెల్యేలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అశోక్‌ గెహ్లాత్‌ తాజాగా పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటుతో పదవి గండం ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే అశోక్, సచిన్‌ల మధ్య సీఎం పదవి విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజా సంక్షోభం నుంచి అశోక్‌ గెహ్లాత్‌ బయటపడతారా..? లేదా పదవి కోల్పోతారా..? వేచి చూడాలి.