Idream media
Idream media
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ సచిన్ పైలెట్ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ వర్గం ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ స్పీకర్ సుప్రిం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు ఇవ్వకుండా తాము ఆదేశాలు జారీ చేయలేమని సుప్రిం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఉన్న అడ్డంకులు తుది తీర్పు ఇచ్చే 24 గంటల ముందు తొలగిపోయాయి.
నిన్న మొన్నటి వరకు రాజకీయ పార్టీల మధ్య సాగిన రాజస్థాన్ రాజకీయం ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తోంది. ప్రస్తుతం అందరూ పైలెట్, అతని వర్గం 19 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పడుతుందా..? లేదా వారికి ఊరట లభిస్తుందా..? అనే అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. తీర్పు తర్వాత రాజస్థాన్ రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయి. సీఎం అశోక్ గెహ్లాత్ తన బలం అసెంబ్లీలో నిరూపించుకోవాలని సచిన్ పైలెట్ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే వీరిపై వేటు వేసిన తర్వాత బల నిరూపణకు అశోక్ గెహ్లోత్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో పార్టీ జారీ చేసిన విప్ తమకు వర్తించదని పైలెట్ వర్గం వాదనను హైకోర్టు సమర్థిస్తుందా..? లేక స్పీకర్ చర్యలను సమర్థిస్తుందా..? వేచి చూడాలి.