iDreamPost
android-app
ios-app

రంగంలోకి ప్రియాంకా గాంధీ : విజ‌య సంకేతాలు..?

రంగంలోకి ప్రియాంకా గాంధీ : విజ‌య సంకేతాలు..?

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. అధికారాన్ని కాపాడుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ర‌ణ్ దీప్ సుర్జేవాలాతో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం స‌చిన్ పైలట్ తో సంప్ర‌దింపులు జ‌రిపారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ఏర్ప‌డిన స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. అనంత‌రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా రంగంలోకి దిగారు. సీఎల్పీ స‌మావేశానికి ముందు రాజ‌స్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్ పైలట్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలిసింది. ఇరువురి వాద‌న‌లూ విన్న ప్రియాంక గాంధీ స‌మ‌స్య ప‌రిష్కారానికి మ‌ధ్యే మార్గం ఆలోచిద్దామ‌ని, ప్ర‌స్తుతానికి వివాదాలు వీడి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాల‌ని సూచించిన‌ట్లు తెలిసింది. అయిన‌ప్ప‌టికీ స‌చిన్ పైలట్ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికీ చెప్ప‌లేదు. 200 సీట్లున్న రాజ‌స్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు 107 మంది ఉన్నారు. 10 మంది స్వతంత్ర సభ్యులతో బాటు.. రాష్ట్రీయ లోక్ దళ్, సీపీఎం, భారతీయ ట్రైబల్ పార్టీ లకు చెందిన 5గురు ఎమ్మెల్యేలు గెహ్లాట్ కు మద్దతు ఇచ్చాయి. అయితే.. ఇప్పుడు సచిన్ పైలట్ రూపంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది.

విజ‌య సంకేతాలు…

అశోక్ గెహ్లాట్ నివాసంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం అనంత‌రం ముఖ్యమంత్రి గెహ్లాట్ సహా సమావేశానికి హాజరైన నేతలంతా కలిసికట్టుగా ‘విక్టరీ’ సంకేతాలిచ్చారు. జైపూర్‌లోని గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్‌పీ సమావేశానికి 90 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరైనట్టు పార్టీ వర్గాల సమాచారం. దీనికి ముందు, కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, గెహ్లాట్ సారధ్యంలోని ప్రభుత్వం ఐదేళ్లూ సుస్థిర పాలన సాగిస్తుందని చెప్పారు. గత 48 గంటల్లో ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తో తాను చాలా సార్లు మాట్లాడినట్టు కూడా తెలిపారు. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా పార్టీ వేదకలపై పరిష్కరించుకునే వీలుంటుందని చెప్పారు. స‌మావేశం అనంత‌రం నేత‌లంద‌రూ విజ‌య సంకేతాలు చూప‌డంతో ప్ర‌స్తుతానికి స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది. దీనిపై స‌చిన్ పైల‌ట్ మాత్రం ఇంకా ఏ విష‌య‌మూ చెప్ప‌లేదు.

వివాదానికి అస‌లు కార‌ణాలివేనా..?

తండ్రి నుంచి రాజకీయాన్ని వారసత్వంగా అందుకున్న సచిన్ పైలట్. తండ్రి రాజేశ్ పైలట్ రాజీవ్ గాంధీకి స‌న్నిహితుడు. ఆ విధంగా రాజేశ్ పైల‌ట్ కుమారుడు స‌చిన్ పైలట్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ గాంధీ ఎక్కువగా సచిన్ పైలట్ పైనే ఆధారపడేవారు. 2004లో దౌసా లోక్ సభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైనప్పుడు యంగెస్ట్ పార్లమెంటేరియన్ గా స‌చిన్ ఖ్యాతినార్జించారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టోంక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతి త‌క్కువ మెజార్టీతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రేసులో ఉన్నారు. అత‌నికి పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అశోక్ గెహ్లాట్ పోటీగా మారారు. ముఖ్యమంత్రిగా సీనియర్ ఉండాలనే సోనియా గాంధీ అభిప్రాయంతో చివరికి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సచిన్ పైలట్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. నాటి నుంచీ వారిద్ద‌రి మ‌ధ్య వివాదం రగులుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పైలట్ సొంతగూడు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తరపున సచిన్ పైలట్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో తారాస్థాయికి చేరుకుంది. ఇదే అదునుగా బీజేపీ ఈ రాష్ట్రంపై క‌న్నేసింద‌నే ప్ర‌చారం జోరందుకుంది.

సొంత పార్టీ ప్ర‌య‌త్నాల్లో ఉన్నారా..?

ప్రియాంకా గాంధీ తో స‌మావేశం అనంత‌రం కూడా స‌చిన్ పైల‌ట్ సొంత పార్టీ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జోరందుకుంది. మరోవైపు, సచిన్ పైలట్ బీజేపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. తాను బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేశారు. ఆయన సొంతంగా పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సీఎం పీఠంపై పట్టుబడుతున్న సచిన్‌కు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. ‘ప్రగతిశీల కాంగ్రెస్‌’‌గా దానికి నామకరణం చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స‌మావేశం అనంత‌రం నేత‌లంద‌రూ సంతోషంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం చూస్తే సొంత పార్టీ అవ‌కాశాలు దాదాపు స‌న్న‌గిల్లిన‌ట్లే అని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా.