iDreamPost
iDreamPost
చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న రాజస్థాన్ మంత్రివర్గ ప్రక్షాళనకు మార్గం సుగమం అయ్యింది. గత ఏడాది కాలంగా సీఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం కాకపోవడంతో కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. గత వారం అటు సీఎం గెహ్లోట్.. ఇటు సచిన్ పైలట్ వేర్వేరుగా సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ పెద్దలతో జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. పునర్వ్యవస్థీకరణలో పైలట్ వర్గానికి సముచిత స్థానం కల్పించడంతో పాటు సీనియర్ నేత సచిన్ పైలట్‌కు పార్టీ జాతీయ విభాగంలో కీలక పదవి ఇస్తామని చెప్పి సోనియా చెప్పడంతో వివాదం ముగిసిందని తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళనకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు.
సోనియాకు రాజీనామాలు
రాష్ట్ర రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరి, ఆరోగ్య మంత్రి రఘు శర్మ, విద్యామంత్రి గోవింద్ సింగ్ దోస్తారా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారని కాంగ్రెస్ రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ ప్రకటించారు. వాటిని ఆమోదం కోసం సీఎంకు పంపుతామని చెప్పారు. హరీష్ చౌదరి పార్టీ పంజాబ్ ఇన్‌ఛార్జిగా, రఘు శర్మ గుజరాత్ ఇన్‌ఛార్జిగా, గోవింద్ సింగ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. వీరంతా పార్టీకి పూర్తిస్థాయిలో సేవ చేసేందుకు సిద్ధపడి రాజీనామాలు చేశారని మాకెన్ వెల్లడించారు. ప్రస్తుతం కేబినెట్‌లో 21 మంది మంత్రులు ఉండగా ముగ్గురి రాజీనామాతో ఆ సంఖ్య 18కి తగ్గింది.రాజస్థాన్ శాసనసభలో మొత్తం 200 మంది సభ్యులు కాగా కేబినెట్‌లో గరిష్ఠంగా 30 మంది మంత్రులు ఉండవచ్చు. దాంతో 12 ఖాళీల భర్తీకి రెండు రోజుల్లో విస్తరణ జరిపేందుకు సీఎం గెహ్లాట్ సిద్ధం అవుతున్నారు.
ఏడాదికిపైగా గెహ్లాట్-పైలట్ వివాదం
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యనేతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉన్న విభేదాల నేపథ్యంలో గత ఏడాది జూలైలో తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. దాంతో పైలట్‌తో సహా ఆయన వర్గానికి చెందిన మంత్రులు విశ్వేన్ద్ర సింగ్, రమేష్ మీనాలను తొలగించారు. అప్పటి నుంచీ ఆ వివాదం నలుగుతోంది. దీనికి ముగింపు పలికేందుకు గతవారం సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు.గెహ్లోట్, సచిన్‌లను ఢిల్లీకి పిలిపించి వేర్వేరుగా చర్చలు జరిపారు. అయితే సచిన్‌కు మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం సుముఖత చూపక పోవడంతో మధ్యేమార్గంగా పైలట్‌కు పార్టీలో జాతీయ స్థాయి పదవి ఇస్తూ.. ఆయన వర్గానికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పిస్తామని సోనియా ప్రతిపాదించారు. దానికి ఇద్దరు నేతలు అంగీకరించడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.