iDreamPost
android-app
ios-app

అసెంబ్లీకి గవర్నర్‌ సై.. రాజస్థాన్‌ రాజకీయంలో నెక్ట్స్‌ ఏంటి..?

అసెంబ్లీకి గవర్నర్‌ సై.. రాజస్థాన్‌ రాజకీయంలో నెక్ట్స్‌ ఏంటి..?

రాజస్థాన్‌ రాజకీయ ఆటలో ఓ పీటముడి వీడింది. అసెంబ్లీ సమావేశపరిచేందు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్ర సంసిద్ధత వ్యక్తం చేయడంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయం ఆటలో కీలక ముందడుగు పడింది. 21 రోజులు నోటీస్‌ పిరియడ్‌తో అసెంబ్లీని సమవేశపరచాలంటూ నాలుగో సారి అశోక్‌ గెహ్లాత్‌ మంత్రివర్గం పంపిన సిఫార్సుకు గవర్నర్‌కు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆగస్టు 14వ తేదీన రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీని సమావేశపరచాలంటూ మొదటి సారి ఈ నెల 24వ తేదీన మంత్రివర్గం సిఫార్సు చేసిన తేదీ నుంచి 21 రోజుల సమయం లెక్కించాలన్న సీఎం అశోక్‌ విజ్ఞప్తిని గవర్నర్‌ మన్నించడంతో మరో 15 రోజుల్లో రాజస్థాన్‌ రాజకీయం అసెంబ్లీ వేదికగా సాగనుంది.

21 రోజుల నోటీస్‌ పిరియడ్‌తో సమావేశం నిర్వహించడం లేదా తక్షణమే కావాలంటే బలనిరూపణ సిద్ధం అవడం అనే రెండు షరతులతో మంత్రివర్గం పంపిన మొదటి మూడు సిఫార్సులను గవర్నర్‌ తిప్పి పంపడంతో ఎట్టకేలకు నాలుగోసారి సీఎం అశోక్‌.. 21 రోజుల నోటీసు పిరియడ్‌ను ఎంచుకున్నారు. సీఎల్పీ భేటీకి హాజరుకావాలని జారీ చేసిన విప్‌ను సచిన్‌తోపాటు అతని వర్గం 19 మంది ఎమ్మెల్యేలు ఉల్లంఘించడంతో వారిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకే విప్‌ వర్తిస్తుందని స్పీకర్‌ జారీ చేసిన నోటీసులను సచిన్‌ వర్గం హైకోర్టులోసవాల్‌ చేసింది. హైకోర్టు సచిన్‌ వర్గ వాదనను సమర్థించడంతో.. సచిన్‌ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి బలపరీక్షకు సిద్ధం అవుదామనుకున్న అశోక్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది.

అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్ర పెట్టిన రెండు షరతుల్లో బలనిరూపణకు వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేస్తే.. సచిన్‌ పైలెట్‌ వర్గం ఓటింగ్‌లో పాల్గొంటుంది. పలితంగా తనకు చిక్కులు వస్తాయని అశోక్‌ భావిస్తున్నారు. 200 ఎమ్మెల్యేలు గల అసెంబ్లీలో ప్రతిపక్షంలో 76 మంది కూర్చుకున్నారు. ఇందులో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సచిన్‌ వర్గం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది కాబట్టి.. అప్పడు ప్రతిపక్ష బలం 91కి చేరుకుంటుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్‌కు 104 నుంచి 106 ఎమ్మెల్యే మద్ధతు ఉందని వార్తలొస్తున్నారు. ఒకరిద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు అప్పటికి ఎవరివైపు మొగ్గుచూపుతారో తెలియని అంశం. బల నిరూపణకు 101 ఎమ్మెల్యే మద్ధతు అవసరం. ప్రస్తుతం అశోక్‌ వర్గంలో ఉన్నారని ప్రచారం సాగుతున్న ఎమ్మెల్యేలలో ఆరుగురు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలు. గత ఏడాది వారు కాంగ్రెస్‌లో చేరారు. వారు తమ పార్టీ ఎమ్మెల్యేలే అంటూ బీఎస్పీ వారికి ఇటీవల విప్‌ జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ధేశించింది. వారు తమ పార్టీలో విలీనం అయ్యారని కాంగ్రెస్‌ వాదిస్తోంది. ఈ విషయంపై బీఎస్పీ తాజాగా రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించింది. కాబట్టి.. కోర్టు విచారణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. తీర్పు ఎలా వస్తుందో ఊహించలేం. ఈ నేపథ్యంలో అశోక్‌.. వెంటనే బలపరీక్షకు సిద్ధం కాలేదు.

21 రోజుల నోటీస్‌ పిరియడ్‌కు అశోక్‌ మొగ్గు చూసేందుకు బలమైన కారణాలు ఉన్నాయి. ఏదో ఒక బిల్లు, లేదా తీర్మానం ప్రవేశపెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేస్తే.. సచిన్‌ వర్గం ఆ విప్‌ను ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు వేసేందుకు మార్గం సుమగం అవుతుంది. సచిన్‌ పైలెట్‌ సహా 19 మందిపై అనర్హత వేటు పడితే.. ఇక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుకుంటుంది. అప్పుడు మేజిక్‌ ఫిగర్‌ 91 అవుతుంది. ప్రస్తుతం అశోక్‌ వర్గంలో ఉన్నారని చెబుతున్న 104 లేదా 106 ఎమ్మెల్యేలలో బీఎస్పీ ఎమ్మెల్యేలు ఆరుగురు మినహాయిస్తే 100 మంది ఉంటారు. ఇందులోనూ స్వతంత్ర ఎమ్మెల్యేలు నలుగురైదుగురు అటు ఇటుగా ఉన్నా సాధారణ మెజారిటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు విశ్వాస పరీక్షలో అశోక్‌ సులువగా గట్టెక్కగలుగుతారు. అందుకే తర్జనభర్జనల తర్వాత పక్కా వ్యూహంతోనే 21 రోజుల నోటీస్‌ పిరియడ్‌లో అసెంబ్లీని సమావేశపరిచే ఆప్షన్‌ వైపు అశోక్‌ మొగ్గుచూపారని ఓ విశ్లేషణ. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత రాజస్థాన్‌ రాజకీయంలో ఎలాంటి ట్విస్ట్‌లు, ఎత్తులకు పైఎత్తులు సాగుతాయో వేచి చూడాలి.