Idream media
Idream media
ఒకేసారి 135 నామినేటెడ్ పోస్టులను భరీ చేసి రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఆయా పదవుల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి, స్థానికంగా బలమైన నేతలతోపాటు సామాన్యులను అందలం ఎక్కించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన రాజన్న దళం చిరంజీవి రెడ్డికి ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా పదవి దక్కింది.
ఎవరీ చిరంజీవి రెడ్డి..?
శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం అనంతపురం గ్రామానికి చెందిన మెట్టుకూరి చిరంజీవి రెడ్డి.. రాజకీయ జీవితం కావలి పట్టణం, ఉదయగిరి నియోజకవర్గాల్లో సాగింది. డిగ్రీ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ రంగ ప్రవేశం తర్వాత చిరంజీవి రెడ్డి ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర ఉపాధ్యాక్షుడుగా పని చేశారు.
స్వగ్రామం అనంతపురం గ్రామ సర్పంచ్‌గా 1995లో ఎన్నికైన చిరంజీవి రెడ్డి తన ప్రజా జీవితాన్ని మొదలు పెట్టారు. సర్పంచ్ పదవి తర్వాత 2001లో సిద్ధనకొండూరు ఎంపీటీసీగా గెలిచారు. 2004 నుంచి 2006 వరకు కలిగిరి మండల పరిషత్ అధ్యక్షుడుగా పని చేశారు. 2006లో కలిగిరి జడ్పీటీసీగా గెలిచారు.
హేమాహేమీలతో పోటాపోటీ రాజకీయాలు..
కాంగ్రెస్‌వాది, కావలి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా(1978, 1985, 1989, 1994) గెలిచిన కలికి యానాది రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవిరెడ్డి ఆయన అనుచరుడుగా కావలి పట్టణ రాజకీయాల్లో చరుకుగా వ్యవహరించారు. 2004లో యానాదిరెడ్డిని కాదని మాగుంట పార్వతమ్మ వర్గంలో చేరిన చిరంజీవి రెడ్డి కావలి మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పారు. హేమాహేమీలను కాదని మున్సిపల్ చైర్మన్ పదవి తాను మద్ధతు ఇచ్చిన వ్యక్తికి దక్కేలా చేసుకున్నారు. పలు విషయాల్లో మాగుంట పార్వతమ్మ ఆదేశాలను కూడా దిక్కరించి చిరంజీవి రాజకీయాలు చేశారు. ఫలితంగా మాగుంట సిబిరంలో ఆయన ఎక్కువ కాలం ఇమడలేకపోయారు.
Also Read : రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గురించి తెలుసా..?
రాజన్నదళం పార్టీ..
2009 నుంచి సొంత నియోజకవర్గం ఉదయగిరి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గంలో చేరిన చిరంజీవి రెడ్డి.. ఆయన వెంట నడిచారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలో అన్నీ తానై వ్యవహరించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి విజయానికి కృషి చేశారు. అయితే ఆ తర్వాత ఏడాదికే మేకపాటితో విభేదాలు తలెత్తాయి. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన చిరంజీవి రెడ్డి.. రాజన్నదళం పేరుతో రాజకీయ పార్టీని పెట్టారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కలిగిరి మండలంలోని అన్ని పంచాయతీలు రాజన్నదళం పార్టీ గెలుచుకోవడం సంచలనమైంది. కలిగిరి, కొండాపురం మండలాల్లో గట్టిపట్టున్న రాజన్నదళం చిరంజీవి రెడ్డి.. 2014 ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయడంతో టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు విజయం సాధించారు.
వేమిరెడ్డికి దగ్గరై..
వైఎస్సార్ అనుచరుడుగా ఉన్న చిరంజీవి రెడ్డి.. స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి దూరం అయ్యారు. వైఎస్ జగన్‌కు మద్దతు తెలపాలనుకున్న చిరంజీవి రెడ్డి.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆయన ద్వారా మళ్లీ పార్టీలో చేరారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్.. చిరంజీవి రెడ్డికి కండువా కప్పారు. 2019లో మళ్లీ ఉదయగిరిలో వైసీపీ జెండా ఎగిరింది. ఉదయగిరి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకుని బలంగా ఉన్న చిరంజీవి రెడ్డికి వైఎస్ జగన్.. రాష్ట్ర స్థాయి పదవిని ఇచ్చి తగిన గుర్తింపును కల్పించడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : స్వాతి రాణికి జీసీసీ.. బుల్లిబాబుకు ట్రైకార్