Idream media
Idream media
తమిళ తలైవర్ సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశం వార్తలు ఇప్పటివి కావు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రజనీ పార్టీ పెడతారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు మళ్లీ రజనీ పార్టీ ప్రచారం జోరందుకుంది. ఈసారి తప్పనిసరిగా పార్టీ పెడతారని చాలా మంది సంకేతాలు ఇస్తున్నారు. నవంబర్ లో పార్టీపై ప్రకటన వస్తుందని అంటున్నారు. తమిళనాడులో రజనీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన తలైవర్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తానని రజినీకాంత్ అంటున్నారు కానీ.. ఎప్పుడు వస్తాను? పార్టీ పేరేంటి? అనే దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. మరోవైపు తమిళనాట ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతుంది. తలైవర్ పొలిటికల్ పార్టీ అనౌన్స్‌మెంట్‌పై ఇదిగో అదిగో అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ రజినీకాంత్ మాత్రం నోరు మెదపడం లేదు.
తమిళనాట కొత్త పార్టీ చర్చ
ఇప్పుడు మరోసారి రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నవంబర్‌లో తలైవర్ పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన తనకు దగ్గరగా ఉన్న అభిమాన బృందంతో ఆయన చర్చ జరుపుతున్నారని టాక్. అలాగే.. ఢిల్లీలో పార్టీ పేరు, గుర్తును రిజిష్టర్ చేయాలంటూ కూడా ఆయన తరపున లాయర్లు కూడా రజినీకాంత్‌కు సూచించారని..నవంబర్ నెలలో పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు తప్పకుండా ఈసారి ఎన్నికల్లో తమ తలైవర్ హవా ఉంటుందని అంటుంటే.. సామాన్యులు మాత్రం ఈసారైనా రజినీకాంత్ పార్టీని అనౌన్స్ చేస్తారా? లేక ఎప్పటిలాగానే హల్‌చల్ చేస్తున్న వార్తలు చివరకు వార్తలుగానే మిగిలిపోతాయా? అని వేచి చూడాలి.
రజనీ పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం
త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని, తన గురువు రజినీకాంత్ పార్టీలో చేరుబోతున్నానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇటీవల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమిళ సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే రజినీ పార్టీలో చేరడానికి లారెన్స్ ఓ షరతు విధించాడు. రజినీకాంత్ సీఎం అభ్యర్థి అయితేనే తాను పార్టీలో చేరతానని, వేరే వ్యక్తి అయితే అందుకు తాను అంగీకరించబోనని లారెన్స్ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో అనుభవం వున్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని, తను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని గతంలో రజనీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన నిర్ణయాన్ని రజినీ వెనక్కి తీసుకోవాలని కోరుతూ లారెన్స్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.