Idream media
Idream media
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని సర్కార్ జనాభా నియంత్రణ బిల్లును రూపొందించింది. యూపీతో పాటుగా అస్సాం వంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణ బిల్లుపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలోనూ జనాభా నియంత్రణను అమలు చేయాలనే డిమాండ్ ను లేవనెత్తుతున్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్. దీనిపై సీఎంకి లేఖ కూడా రాశారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ఈ పరిస్థితుల్లో జనాభా పెరుగుదల మరిన్ని అధ్వాన్న పరిస్థితులకు దారి తీస్తాయట. అందువల్ల ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి జనాభాను నియంత్రించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణలో జన సంఖ్య నాలుగు కోట్లకు చేరువ అవుతోందని టీ రాజాసింగ్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి ఆధార్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. 38510982 మంది ప్రజలు నివసిస్తోన్నట్లు ఆధార్ అంచనా వేసిందని తెలిపారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు అందేలా ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సవాళ్లతో కూడుకుని ఉంటుందని టీ రాజాసింగ్ చెప్పారు. పింఛన్లు నిత్యావసర సరుకుల పంపిణీ అభివృద్ధి పనులను అందరికీ అందడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక లోటును ఎదుర్కొంటోన్నందున పెరుగుతోన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను సమకూర్చాల్సి రావడం కష్టమని తెలిపారు. యూపీ అస్సాం సీఎంలు ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు మొదలు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కూడా దీనిపై ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు.
జనాభా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశ పెట్టాలని టీ రాజాసింగ్ డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులు కొన్ని తరాల వరకు మనుగడలో ఉండటానికి జనాభా నియంత్రణ తప్పనిసరి అని అన్నారు. మితిమీరిన జనాభా వల్ల సహజ వనరులు ఖాళీ అవుతాయని అన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం మంచినీరు నివాస వసతి విద్య వైద్యం విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించలేని పరిస్థితులను అధిగమించడానికి జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.