iDreamPost
iDreamPost
రాష్ట్రంలోని పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు, మ్యానిఫెస్టోలో తాను ఇచ్చిన హామిలను నెరవేర్చే క్రమంలో మరో హామీని నిలబెట్టుకునేందుకు ముందడుగు వేశారు. పెండింగ్ లో ఉన్న పెళ్ళికానుకల బకాయలు విడుదల చెయటంతో పాటు వచ్చే శ్రీరామనవమి నుండి పెంచిన పెళ్ళికానుక నిధులు పంపిణి చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసారు.
గత ప్రభుత్వ హయాములో భారీగా పెండింగ్ లో పెట్టిన పెళ్ళి కానుకలను క్లియర్ చేయడంలో భాగంగా , రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 20 కోట్లు చొప్పున మొత్తం 270 కోట్లు మంజూరు చేశారు, దీంతో పాటు జగన్ గారు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా వచ్చే శ్రీరామనవమి నుంచి పెంచిన పెళ్ళి కానుకను కొత్త జంటలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పేద కుటుంబాల వారు తమ పిల్లలకి పెళ్ళి చేసి అప్పుల పాలు అవుతున్నారనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం నుండి మరింత ఆర్ధిక సాయం చేయాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్ భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఐదింతలు పెంచుతూ 20వేల నుండి లక్ష రూపాయలు చేశారు.
ప్రభుత్వం అందించే ఈ సాయం వారికి అందాలి అంటే వారు దగ్గర్లో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీసుకు వెళ్ళి సంబంధింత పత్రాలు తగిన రుసుము చెల్లించి భవన నిర్మాణ కార్మికుడు అనే గుర్తింపు పొందవలసి ఉంటుంది. ఇక గతంలో ఎస్.సి – ఎస్.టీ లు కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం తరుపున నుండి వచ్చే 75వేలను 1.20 లక్షలకు పెంచారు. అలాగే బి.సి.లకు 35 వేల నుండి 50 వేలకు, అదే కులాంతర వివాహం చెసుకుంటే 50వేల నుండి 75వేలకు పెంచారు. దివ్యాంగులకు లక్ష నుండి లక్షన్నరకు పెంచుతునట్టు , ఇవి రాబోయే శ్రీరామనవమి నుండి పంపిణీ జరుగుతుందని ప్రకటించారు.
పథకానికి మార్గదర్శకాలు..
► వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
► వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి.
► ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
► వివాహం ఏపీలోనే చేసుకోవాలి.
► ఇద్దరికీ ఆధార్‌కార్డు, వధువు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి.
► వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి.
► వివాహ తేదీ నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
► తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు.
► వరుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడైనా వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే.
తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు
♦ మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, జనన ధ్రువీకరణ పత్రం.
♦ వయస్సు నిర్ధారణకు పదో తరగతి లేదా ఇంటిగ్రేటెడ్ మీ–సేవా సర్టిఫికెట్.
♦ కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
♦ తెల్లరేషన్ కార్డు లేదా మీ–సేవా ఆదాయ ధ్రువీకరణ పత్రం.
♦ పెళ్లికూతురు బ్యాంకు ఖాతా జిరాక్స్‌ను ఇవ్వాలి.
♦ దివ్యాంగులైతే సదరు సర్టిఫికెట్ (కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం కలిగిఉండాలి).
♦ భవన నిర్మాణ కార్మికులైతే కార్మిక శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గుర్తింపు కార్డు.