Idream media
Idream media
కాషాయ పార్టీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది భారతీయ జనతా పార్టీ. హిందూత్వమే ఆ పార్టీ ప్రధాన ఎజెండా. నేతలు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతారు. కానీ.. ఇటీవలి కాలంలో అన్ని పార్టీలూ ఈ జపం చేస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే.. టీడీపీ, జనసేన కూడా చాలా సందర్భాల్లో కాషాయీకరణ జపం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాంటి దారిలోనే వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అన్నా చెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అపర హిందువులుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ నోటి వెంట హిందూ రాజ్యాన్ని తెస్తామని ఏ రోజు మాట రాలేదు. అంతే కాదు ఈ హిందువులపట్ల ప్రత్యేక శ్రద్ద లేనట్లే ఆ పార్టీ వ్యవహారాలు ఉండేవి. ఇందిరా గాంధీ కాలంలో రాజ్యాంగాన్ని సవరించి సెక్యులర్ అన్న పదాన్ని చేర్చారు. అంటే లౌకిక రాజ్యం అని. మరి లౌకిక భావన ఒక్క హిందువులకే ఉండాలా మిగిలిన వారికి ఉండకూడదా అన్న దాని మీద హిందువుల నుంచి తీవ్ర నిరసనలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కొంత మందిలో పెరిగిన అసంతృప్తిని రాజకీయంగా బీజేపీ వాడుకుంది. ఈ దేశంలో హిందుత్వ వినిపించినా హిందువు అన్న శబ్దం పదే పదే చెవులలో మోగుతున్నా దానికి కారణం కాంగ్రెస్ ఒక మతం పట్ల అనుసరించిన నిర్లిప్త వాదం ప్రధాన కారణం అయితే అలా రాజుకున్న సెగను తనకు అనుకూలం చేసుకున్న బీజేపీ మరో కారణం.
తాజాగా జైపూర్ టూర్ లో రాహుల్ గాంధీ హిందూత్వ అంటే ఏంటి హిందువు అంటే ఎవరు అన్న దాని మీద తనదైన భాష్యం చెప్పారు. ఎవరికీ భయపడని వారు అన్ని మతాలను గౌరవించేవారు హిందువులు అని ఆయన నిర్వచనం చెప్పారు. ఇక అధికారం కోసం గట్టిగా నినాదాలు చేసేవారు నకిలీ హిందువులు అని ఆయన బీజేపీని ఘాటుగానే విమర్శించారు. ఈ దేశంలో ఇపుడు రాజ్యమేలుతున్నది అలాంటి హిందూత్వ రాజే అని కూడా పేర్కొన్నారు. అలాంటి హిందూత్వ రాజ్ ని నిర్మూలించి హిందూ రాజ్యాన్ని తేవాలని కూడా రాహుల్ గట్టిగా కోరుకున్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు వహిస్తున్న ప్రియాంక గాంధీ కూడా హిందూత్వమే ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. గత గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ తొలిసారి సాఫ్ట్ హిందుత్వ వైఖరిని తీసుకున్నాడు. గుళ్ళు గోపురాలు తిరుగుతూ జంధ్యం కనిపించేలా పూజలు చేశాడు .
ఇప్పటికే కులాల ఆధారంగా చేస్తున్న రాజకీయాలు కుంపట్లును రగిలిస్తున్నాయి. ఇప్పుడు మత రాజకీయాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తుండడం విచారకరమైన పరిణామం..అధికారం కోసం కాంగ్రెస్ కూడా ఆ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తుండడం ఆలోచించాల్సిన విషయం.
Also Read : కార్యక్రమం ఏదైనా బండి గురి టీఆర్ఎస్ పైనే..