Idream media
Idream media
జన్మదిన వేడుకలకు దూరంగా రాహుల్ గాంధీ
శుక్రవారం మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు,లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ 50 వ ఒడిలోకి అడుగు పెట్టాడు.ఈ ఏడాది కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభం,గాల్వన్ లోయలో 20 మంది భారత సైనికుల మృతికి సంతాపంగా తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు.అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర, జిల్లా శాఖలకు సూచించింది.
ఇక రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది. అలాగే కరోనా ప్రేరిత లాక్‌డౌన్ వలన ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలకు,వలస కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.ఇదే సందర్భంలో పేదలకు, నిస్సహాయులకు ఆహారం,నిత్యావసరాల కిట్లు అందజేయాలని ఏఐసిసి తమ క్యాడర్‌ను కోరింది. అలాగే తమ నేత జన్మదినం సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కరోనా కిట్లను పంపిణీ చేస్తున్నారు. పేదలు, వలస కార్మికులకు ప్రయోజనం కలిగేలా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మాతృభూమిని రక్షించే క్రమంలో చైనా ఆర్మీ చేతిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల సంస్మరణార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని,ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు జరపాలని రాష్ట్ర,జిల్లా శాఖలను ఏఐసిసి ఆదేశించినట్లు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ తెలిపారు.