iDreamPost
android-app
ios-app

ర‌ఘురామ‌కూ ర‌మేష్ ఆస్ప‌త్రే కావాలా..?

ర‌ఘురామ‌కూ ర‌మేష్ ఆస్ప‌త్రే కావాలా..?

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి ఆరోగ్యం బాగాలేన‌ప్పుడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ర‌మేష్ ఆస్ప‌త్రిలో చేర్పించాల‌ని కోరారు. అందులోనే చికిత్స పొందారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో అరెస్ట‌యిన నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు కూడా త‌న‌ను ర‌మేష్ ఆస్ప‌త్రిలోనే చేర్చాల‌ని కోర‌డం ఆస‌క్తిగా మారింది. ఆ ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి, చంద్ర‌బాబుకు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌న్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో పది మంది కరోనా బాధితుల మృతికి కారణమైన ఆస్పత్రి యాజ‌మాన్యంపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. అప్ప‌ల్టో పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబును చంద్ర‌బాబు త‌న ఇంట్లో దాచార‌న్న ఆరోప‌ణ‌లూ వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా ర‌ఘురామ కేసులో ఆ ఆస్ప‌త్రి మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది.

ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన రఘురామకృష్ణరాజు గాయాల‌పై నిర్ధార‌ణ‌కు, చికిత్స కు అత‌డిని రమేష్ ఆస్పత్రికి తరలించాలని ర‌ఘురామ‌ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం దీన్ని తిర‌స్క‌రించింది. ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ర‌ఘురామ‌ను రమేష్ ఆస్పత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీస్‌కు పంపినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్థావించారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచే రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం, వారు చెప్పిందే నివేదికగా ఇచ్చే అవకాశం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు స్వయంగా జీజీహెచ్ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రైవేట్ వైద్యులు, సీఆర్పీఎఫ్ భద్రత, కుటుంబ సభ్యులు ఉంటారని వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన ఆదేశాలను హైకోర్టు వెల్లడించిందని తెలిపారు. ఆ ఆర్డ‌ర్ రాక‌ముందే రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ అంశాన్ని సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తే తమ తీర్పును సవరిస్తామని సీఐడీ కోర్టు తెలిపింద‌ని సుధాకర్‌ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండ‌గా ర‌ఘురామ రాజు కూడా ఆ ఆస్ప‌త్రినే ప్ర‌త్యేకంగా ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయనను అధికారులు గుంటూరు జైలుకు తరలించారు.

రఘురామకృష్ణరాజుకు ఖైదీ నంబర్‌ 3468 కేటాయించారు. జైల్లోని పాత బ్యారక్‌లో ఒక సెల్‌ను అలాట్‌ చేశారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే.

ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్‌ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్‌ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. కోర్టు ఈ నెల 28 వరకు రఘురామకృష్ణరాజు రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది.