iDreamPost
android-app
ios-app

వరస సినిమాలతో రాశి ప్లానింగ్

  • Published Jun 12, 2021 | 6:25 AM Updated Updated Jun 12, 2021 | 6:25 AM
వరస సినిమాలతో రాశి ప్లానింగ్

పైకి కనిపించడం లేదు కానీ రాశి ఖన్నా బాగానే బిజీగా ఉంది. ప్రతి రోజు పండగే సూపర్ హిట్, వెంకీ మామ కమర్షియల్ సక్సెస్ తర్వాత తనకు మళ్ళీ డిమాండ్ వస్తుందేమోనన్న అంచనాలకు భిన్నంగా వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ గట్టి ప్రభావమే చూపించింది. కానీ ఆ టైంకే తమిళంలో మంచి ఆఫర్లు క్యూ కట్టడంతో అటుఇటు బ్యాలన్స్ చేసుకుంటూ బండి నెట్టుకుంటూ వస్తోంది. అలా అని తను ఖాళీగానూ లేదు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో వైపు ఓటిటిలో అడుగు పెడుతోంది. సమంతా, తమన్నా, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి తర్వాత కాస్త ఆలస్యంగానే అయినా వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది.

ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నవి సినిమాలు రాశి ఖన్నాకు మూడున్నాయి. విజయ్ సేతుపతితో చేసిన ‘తుగ్లక్ దర్బార్’ నేరుగా ఓటిటిలో రాబోతోందని టాక్. హాట్ స్టార్ తో ఒప్పందం చేసుకుని త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులోనూ బాగానే ఆడిన చంద్రకళ సీక్వెల్ ‘అరన్ మయి 3’ లోనూ రాశి ఖన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. సుందర్ సి దర్శకుడు. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ తో మొదటిసారి జోడి కట్టిన ‘భ్రమమ్’  రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఇంకా నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మల్లువుడ్ టాక్. బహుశా ఇంకో రెండు మూడు వారాల్లో తెలియొచ్చు.

ఇక తెలుగు విషయానికి వస్తే మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ లో ఆడి పాడుతోంది రాశి. కరోనా లాక్ డౌన్ ఈ షూటింగ్ నెలన్నరగా వాయిదా పడింది. లేకపోతే అక్టోబర్ 1 విడుదలకు సిద్ధమయ్యేదే. నాగ చైతన్యతో నటించిన ‘థాంక్ యు’ ఇటీవలే ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. బాలన్స్ హైదరాబాద్ లో చేస్తారు. తమిళంలో కార్తీ ‘సర్దార్’, మేథావి, సైతాన్ కా బచ్చా నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్యామిలీ మ్యాన్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లోనూ రాశినే హీరోయిన్. మొత్తానికి ఇన్నేసి ప్రోజెక్టులతో రాశి ఖన్నా ఊహించిన దానికన్నా చాలా బిజీగా ఉంది