iDreamPost
android-app
ios-app

కలియుగ కర్ణుడు.. వేల కోట్లు దానం చేసి.. తాను మాత్రం చిన్న ఇంట్లో!

కలియుగ కర్ణుడు.. వేల కోట్లు దానం చేసి.. తాను మాత్రం చిన్న ఇంట్లో!

సంపాదించి కూడ బెట్టుకోవటం తప్ప. సంపాదించిన దానిలో కొంతైనా దానం చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. వేల రూపాయలు సంపాదిస్తూ.. ఓ వంద దానం చేయటానికి ఆలోచించేవారు.. సంపాదించిన దానిలో మొత్తం దానం చేసే వారు కూడా ఈ సమాజంలో ఉన్నారు. కోటిలో ఒక్కరు మాత్రమే డబ్బును కూడ బెట్టుకోవటంలో కంటే.. దాన్ని పంచి పెట్టినపుడే ఎక్కువ సంతోషపడతారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ప్రముఖ వ్యాపార వేత్త ఆర్‌.ఆర్‌ త్యాగరాజన్‌ ఒకరు.

ఆయన తాను సంపాదించిన దాదాపు 6,200 కోట్ల రూపాయలు తన ఉద్యోగులకు దానం చేశారు. తాను మాత్రం ఓ చిన్న ఇంట్లో, ఫోన్‌ కూడా లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్‌ఆర్‌ త్యాగరాజన్‌ తమిళనాడులోని చెన్నైలో 1937, ఆగస్టు 25 జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత పలు ఇన్సురెన్స్‌ కంపెనీల్లో పని చేశారు. అయితే, కస్టమర్ల పట్ల సదరు ఇన్సురెన్స్‌ కంపెనీల తీరు ఆయనకు నచ్చలేదు. అంతేకాదు.. త్యాగరాజన్‌ నివసించే ప్రాంతంలో ఉండే బ్యాంకులు ప్రజల్ని అప్పుల పేరుతో దోచుకునేవి.

ఆ పరిస్థితులు చూసి త్యాగరాజన్‌ చలించిపోయారు. ఈ నేపథ్యంలోనే ఓ అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. స్నేహితులు, బంధువులతో కలిసి 1974లో శ్రీరామ్‌ చిట్స్‌ను ఏర్పాటు చేశారు. అప్పటికి ఆయన వయసు 37 సంవత్సరాలు మాత్రమే. తక్కువ వడ్డీలకు అప్పులు ఇస్తుండటంతో శ్రీరామ్‌ చిట్స్‌పై ప్రజలకు నమ్మకం పెరగింది. దీంతో సంస్థ దినదినాభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ సంస్థ దేశ వ్యాప్తంగా తమ కార్యాకలాపాలను నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 23 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇక, త్యాగరాజన్‌ వేల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించారు.

అయితే, తన సంపాదన పెరుగుతున్న కొద్ది త్యాగరాజన్‌లో మంచి మనసు ఇంకా పెరుగుతూ పోయింది. 2006లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన శ్రీరామ్‌ ఓనర్‌ షిప్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. తన ఆస్తులు మొత్తం.. 6200 కోట్ల రూపాయల్ని ఆ ట్రస్టుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. తర్వాత కంపెనీ వ్యవహారాలనుంచి బ్రేక్‌ తీసుకున్నారు. ఇక, అప్పటినుంచి ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఫోన్‌ కూడా వాడకుండా అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం 15 రోజుల కొకసారి మాత్రమే కంపెనీ మీటింగులకు వెళుతుంటారు. తన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. మరి, తన ఆస్తి మొత్తాన్ని ఉద్యోగుల యూనియన్‌కు దానం చేసిన కులియగ కర్ణుడు త్యాగరాజన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.