iDreamPost
android-app
ios-app

హుజురాబాద్‌లో నిజామాబాద్‌ సీన్‌ రిపీట్‌..! ఆర్ కృష్ణయ్య చెప్పినట్లు చేస్తారా..?

హుజురాబాద్‌లో నిజామాబాద్‌ సీన్‌ రిపీట్‌..!  ఆర్ కృష్ణయ్య చెప్పినట్లు చేస్తారా..?

తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్న హుజురాబాద్‌ ఉప ఎన్నిక రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంకా నోటిఫికేషన్‌ రాకున్నా.. హుజురాబాద్‌ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఇప్పటికే దృష్టి పెట్టాయి. మొదట మంత్రి పదవి నుంచి అవమానకరీతిలో బర్తరఫ్‌కు గురై ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్‌.. గులాబీ అధినేత కేసీఆర్‌పై కాలు దువ్వారు. హుజురాబాద్‌లో పోటీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే ఉంటుందని ప్రకటనలు చేస్తున్న గులాబీ నేతలకు గుబులుపుట్టించే పరిణామం తాజాగా చోటు చేసుకుంది. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరిగేలా ఆర్‌.కృష్ణయ్య ప్రకటన చేశారు.

రంగంలోకి ఆర్‌.కృష్ణయ్య..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు. ఇప్పటికే పలు మార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా పని చేసిన కృష్ణయ్య ఒక్కడే పోటీ చేస్తే ఇందులో పెద్ద విశేషం ఏమీలేదు. వేయి మంది చేత పోటీ చేయించబోతున్నట్లు ఆర్‌.కృష్ణయ్య ప్రకటించి అందరి దృష్టి తనవైపునకు తిప్పుకున్నారు. కేసీఆర్‌ తీరుకు నిరసనగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణయ్య ప్రకటించడంతో గులాబీ నేతలకు కొత్త దిగులు పట్టుకుంది. ఉపాధి హామీ పథకం ఫీల్ట్‌ అసిస్టెంట్లు 7,500 మందిని కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమంగా తొలగించినందుకు నిరసనగా హుజురాబాద్‌ బరిలో వేయి మంది ఉండబోతున్నట్లు చెప్పారు కృష్ణయ్య.

Also Read : ఏపీలో మళ్లీ స్థానిక ఎన్నికల హడావుడి..

నిజామాబాద్‌ సీన్‌ రిపీట్‌ కాబోతోందా..?

ఆర్‌.కృష్ణయ్య ప్రకటనతో.. అందరూ ఒక్కసారిగా గతంలోకి వెళ్లారు. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలను గుర్తు చేసుకుంటున్నారు. 2019లో మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ తనయ కవిత పోటీ చేశారు. బీజేపీ నుంచి డీఎస్‌ కుమారుడు ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్‌ నుంచి మధు యాష్కి పోటీ చేయగా.. 183 మంది రైతులు బరిలో నిలిచారు. పసుపు, జొన్న పంటలకు మద్ధతు ధర లేకపోవడం వల్ల నష్టపోయిన రైతులు.. తమను ఆదుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళనలు చేశారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం వారి ఆందోళనలను పట్టించుకోకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని దాదాపు 200 గ్రామాల నుంచి ఐదుగురు చొప్పన వెయి మంది బరిలోనిలుచున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 183 మంది పోటీలో ఉన్నారు. ఒక్కొక్క రైతుకు గరీష్టంగా 6,096 ఓట్ల నుంచి కనిష్టంగా 84 ఓట్లు పోలయ్యాయి. దీంతో సిట్టింగ్‌ ఎంపీ కవిత ఓడిపోయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ 70,875 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

టీఆర్‌ఎస్‌లో అలజడి..

హుజురాబాద్‌ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌ను ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు కేసీఆర్‌. దళిత బంధు అంటూ కొత్త పథకం కూడా ప్రకటించి.. పైలెట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌ నుంచే అమలు చేయబోతున్నారు. ఈటల రాజేందర్‌ అనుచరుడుకు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్‌ ఇంచార్జి కౌషిక్‌ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. అస్త్ర శస్త్రాలను కేసీఆర్‌ ఉపయోగిస్తున్న తరుణంలో.. ఆర్‌.కృష్ణయ్య ప్రకటన గులాబీ నేతల్లో అలజడి సృష్టిస్తోంది. ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని చెబుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. నిజామాబాద్‌లో కవిత ఓటమిని గుర్తు చేస్తున్నారు. పైగా హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో.. ప్రతి ఓటు కూడా విలువైనదే. చావో, రేవోగా ఈటల రాజేందర్‌ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌.కృష్ణయ్య ప్రకటన కార్యరూపం దాల్చితే.. టీఆర్‌ఎస్‌కు తప్పక నష్టం జరుగుతుంది. అయితే ఆర్‌.కృష్ణయ్య ప్రకటన కార్యరూపం దాల్చుతుందా..? లేదా..? ఈ లోపు ఏమైనా పరిణామాలు చేటు చేసుకుని వెనక్కి తగ్గుతారా..? వేచి చూడాలి.

Also Read : ఎంపీటీసీ భర్తకు కేసీఆర్‌ ఎందుకు ఫోన్‌ చేశారు..?