iDreamPost
android-app
ios-app

దెయ్యాల దీవిలో క్వారంటైన్

దెయ్యాల దీవిలో క్వారంటైన్

వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కరోనా మహమ్మారి ఏమాత్రం అదుపులోకి రాకుండా రోగులు పిట్టల్లా రాలిపోవడం ఇప్పటి తరానికి కొత్తగా ఉన్నా, మానవాళి చరిత్రలో ఇలాంటి మహమ్మారులు ఎన్నో ఉన్నాయి. ప్లేగ్, మశూచి, ఫ్లూ, పోలియో ఇలా అనేక రకాల జబ్బులు లక్షల సంఖ్యలో ప్రాణాలు తీసిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి.

టీకాలు, మందులూ ఏమీ లేని ఆ రోజుల్లో ఐసోలేషన్, క్వారంటైన్ ప్రధాన ఆయుధాలుగా ఆ రోజుల్లో ప్రజలు ఈ మహమ్మారులతో పోరాడారు.

ప్లేగు మహమ్మారి

ఇప్పుడు కరోనా ఇటలీని అల్లకల్లోలం చేసినట్లే 1348లో యూరప్ లో ప్రారంభమైన ప్లేగ్ మహమ్మారి ఇటలీలోని సామ్రాజ్యాలను అల్లకల్లోలం చేసింది. అప్పటికి ఇటలీ ఏకీకరణ జరిగి ఒక దేశం ఏర్పడలేదు. చిన్న రాజ్యాల సమాహారంగా ఉండేది ఆ దేశం. వాటిలో శక్తివంతమూ, సంపన్నవోతమూ అయినది వెనిస్. సముద్ర వ్యాపారంలో అగ్రగామి అయినందున అనేక దేశాలతో వ్యాపార సంబంధాలు ఉన్నందువల్ల ప్లేగు వ్యాధి బాధితులు చాలా ప్రాంతాల నుంచి వచ్చి వెనీస్ లో ఆ వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యారు.

వెనీస్ నగర పాలకుల, అధికారులు దీన్ని వెంటనే గుర్తించి, ప్లేగు బారిన పడిన వ్యక్తులను మిగిలిన ప్రజలతో సంబంధం లేకుండా వేరు చేయాలని నిర్ణయించారు. అందుకు అనువుగా వారికి కనిపించింది వెనిస్ సమీపంలో ఉన్న పోవెగ్లియా ద్వీపం.

దీవిలో క్వారంటైన్

వెనీస్ నగరంలో ప్లేగు బారిన పడిన వ్యక్తులను, వెనీస్ ఓడరేవుకు వచ్చిన ఓడల్లో ప్లేగ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను ఈ ద్వీపంలో ఉంచసాగారు. నలభై రోజుల తర్వాత జబ్బు లక్షణాలు తగ్గిపోతే వారిని తిరిగి నగరంలోకి అనుమతించేవారు. ఒకవేళ మరణిస్తే ఆ దీవిలోనే తగలబెట్టేవారు. ఇటాలియన్ భాషలో నలభైని క్వారంటా అంటారు. అందుకే ఈ పద్ధతికి క్వారంటైన్ అని పేరు వచ్చింది. ఒకవేళ క్వారంటైన్ కి పోకుండా నగరంలో ఎవరైనా ప్లేగ్ లక్షణాలతో మరణిస్తే వారిని కూడా ఈ దీవిలోనే దహనం చేసేవారు. దాదాపు శతాబ్దం కాలం ప్రపంచాన్ని అల్లాడించిన ప్లేగ్ మహమ్మారి అదుపులోకి వచ్చే నాటికి పోవెగ్లియా ద్వీపంలో లక్ష మందికి పైగా రోగుల శవాలను దహనం చేశారు. అందుకే దీనికి దెయ్యాల దీవి అని పేరు వచ్చింది. దెయ్యాలను చూడాలనుకునే వారికోసం కొందరు టూరిస్ట్ ఆపరేటర్లు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు.

న్యూయార్క్ లో కూడా

అంటువ్యాధుల పాలయిన వారిని ఇతరులతో సంబంధం లేకుండా ఐసోలేషన్ లో పెట్టడం అన్నది న్యూయార్క్ నగరంలో కూడా చేశారు గతంలో. న్యూయార్క్ కూడా బిజీగా ఉండే ఓడరేవు కలిగి ఉన్నందున ప్రపంచంలో అనేక దేశాలనుంచీ వచ్చే ప్రజలను ఓడరేవులోనే వైద్యులు పరీక్షలు జరిపి, అనుమానం ఉన్న వారిని క్వారంటైన్ చేసేవారు. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఉన్న బెడ్లో ద్వీపాన్ని ఇందుకు ఉపయోగించారు.