iDreamPost
android-app
ios-app

భౌతికదూరం పాటిద్దాం…. కోవిడ్‌-19పై విజయం సాధిద్దాం: పీవీ సింధు

భౌతికదూరం పాటిద్దాం…. కోవిడ్‌-19పై విజయం సాధిద్దాం: పీవీ సింధు

దేశంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచడానికి ఒలంపిక్ రజత పతక విజేత పీవీ సింధు తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. క్రీడాకారులందరిని వారి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కోవిడ్‌-19కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని ప్రధాని కోరారు. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ పిలుపుకు స్పందించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు కరోనాపై వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ సింధు తన వీడియోలో “బ్యాడ్మింటన్‌ ఆడేటప్పుడు కోర్టులోనే ఆడాలి. అప్పుడే గెలుస్తాం. అవునా..? కరోనాతో ఫైట్ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలి. భౌతికదూరం పాటిస్తేనే కోవిడ్‌-19 మీద మనం విజయం సాధించగలం. మనకు సహాయం అందించడానికి 104 హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్నా సూచనలు పాటిద్దాం.ఇంట్లోనే ఉందాం… కరోనాను కలిసి ఎదుర్కొందాం. Stay Home…Stay Safe” అని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సందేశాత్మక వీడియోని ఆమె తండ్రి పివి రమణ తన సెల్ ఫోన్‌లో షూట్ చేశారు. గత మార్చి నెలలో షట్లర్ పీవీ సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడేందుకు లండన్ వెళ్ళి భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే ప్రభుత్వ సూచనల మేరకు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఇంట్లోనే గడిపింది. ఈ నిర్బంధం ముగిసిన వెంటనే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో 5 లక్షల చొప్పున విరాళము పీవీ సింధు అందించిన సంగతి తెలిసిందే.