iDreamPost
android-app
ios-app

పీ. వీ. నరసింహా రావు- అసలైన విజనరీ

పీ. వీ. నరసింహా రావు- అసలైన విజనరీ

ఇప్పుడంటే ఎవరిని పడితే వారిని విజనరీ అని పిలవడం వల్ల రాజకీయాల్లో విజనరీ అనే పదానికి విలువ లేకుండా పోయింది కానీ కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే ఆ పదానికి అసలైన ఉదాహరణగా కనిపించే నాయకుడు పీ. వీ. నరసీంహా రావు. ఆర్థికవేత్తని తీసుకొచ్చి ఆర్థిక శాఖా మంత్రిగా చేసి, ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావడం వారి విజన్ అని అందరికీ తెలిసిందే. దీనివల్ల దేశానికి ప్రయోజనం జరిగిందా లేదా అన్న దాని మీద కొందరికి ఇంకా సందేహాలు ఉన్నాయి. అది వేరే విషయం. పీవీ గారి విజన్ గురించి ఎక్కువ మందికి తెలియని సంఘటన ఇది.

ప్రజల సంక్షేమం కోసం సాంకేతిక

పీవీ గారు ప్రధాన మంత్రి పీఠం ఎక్కిన కొన్ని రోజుల్లో దేశంలో రక్షణ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రయోగశాలల డైరెక్టర్లతో సమావేశమయ్యారు. “రక్షణ శాఖ కోసం ప్రతి యేటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది ప్రభుత్వం. ఆ డబ్బు బాంబులు, మిస్సైల్స్ లాంటి విధ్వంసకర కార్యక్రమాలకు మాత్రమే కాక లోక కల్యాణం కోసం కూడా ఉపయోగపడాలి. ఆ విధంగా కృషి చేయండి” అని దిశానిర్దేశం చేశారు.

అప్పుడు హైదరాబాద్ DRDO (Defence Research and Development Organization) డైరెక్టర్ గా అబ్దుల్ కలాం గారు ఉండేవారు. పీవీతో సమావేశం అయిన కొన్ని రోజుల తర్వాత కలాంగారు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో వివిధ శాఖాధిపతులను కలిసి తమ దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి చెప్పి, “మీరోగులకు అది ఏ విధంగా ఉపయోగపడగలదో ఆలోచించండి. కలిసి అభివృద్ధి చేద్దాం” అని చెప్పారు.

కలాం-రాజు స్టెంట్

హృద్రోగ విభాగానికి అధిపతి డాక్టర్ సోమరాజు గారితో కలిసి కలాం-రాజు స్టెంట్ పేరిట గుండెకి రక్తం సరఫరా చేసే కరోనరి ధమనులు పూడిపోయినప్పుడు ఆమర్చే కార్డియాక్ స్టెంట్ రూపొందించారు. అప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టెంట్ స్థానంలో ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆపరేషన్ కర్చు చాలా వరకూ తగ్గింది. బాలారిష్టాలను అధిగమించి, లోపాలను సవరించే దశలో కలాం గారు హైదరాబాద్ డీఆర్డీఓ నుంచి, సోమరాజు గారు నిమ్స్ నుంచి వెళ్ళిపోవడంతో ఇది మూలనపడి పట్టించుకునే వారు లేక, మాయమైపోయింది.

ఎఫ్ ఆర్ ఓ – పోలియో రోగులకు వరం

పోలియోతో కాళ్ళు చచ్చుబడిన చిన్నారులు బరువైన ఇనుప కాలిపర్లు తగిలించుకుని మోయలేక అవస్థలు పడుతూ నడవడం అందరూ చూసి ఉంటారు. ఈ కాలిపర్ల స్థానంలో తక్కువ బరువుతో ఎఫ్ఆర్ఓ అని కొత్త పరికరం వచ్చి చాలా మటుకు ఈ చిన్నారుల బాధ తగ్గించింది. దానిని పాలీప్రొపిలీన్ వాడి తయారు చేసేవారు. మిస్సైళ్ళు గాలిలో దూసుకుపోయే సమయంలో ఘర్షణ వల్ల మంటలు రేగకుండా పాలీయురేథేన్ కవచం వాడుతారు. ఇది చాలా ధృఢంగా, తక్కువ బరువుతో ఉంటుంది. పాలీప్రొపిలీన్ స్థానంలో ఈ పదార్ధం వాడడం వల్ల ఎఫ్ఆర్ఓలు మరింత తక్కువ బరువుతో, మరింత ధృఢంగా ఉంటాయని పాలీయురేథేన్ వాడి చేయడం మొదలు పెట్టారు. పాలీయురేథేన్ వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. పోలియో బారిన పడిన కాళ్ళలో కండరాలు బలహీనంగా సన్నగా ఉండి, ఎముకలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎఫ్ఆర్ఓలు ధరించిన కాళ్ళలో ఎముకలు వొత్తుకుని పుండ్లు పడితే, ఆ భాగంలో వేడిచేసి, ఎముకలు వొత్తుకోకుండా ఎఫ్ఆర్ఓని మోల్డ్ చేయగల సౌలభ్యం పాలీయురేథేన్ కల్పిస్తుంది.

హైదరాబాద్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పోలియో రోగం బారిన పడిన చిన్నారులకు అతి తక్కువ ఖర్చుతో, కొన్నిసార్లు ఉచితంగా ఈ ఎఫ్ఆర్ఓలని అందించారు. ఆ తర్వాత పోలియో డ్రాప్స్ విస్తృతంగా వాడడం వలన పోలియో వ్యాధి అంతరించి, ఈ ఎఫ్ఆర్ఓలకి డిమాండ్ లేకుండా పోయింది. ఇప్పటికి అక్కడక్కడా సెరిబ్రల్ పాల్సీ లాంటి పుట్టుకతో వచ్చే అవయవ లోపాలతో బాధపడుతున్న పిల్లలకు దీన్ని వాడుతున్నారు.