iDreamPost
android-app
ios-app

పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఎంపికయ్యారు. ఆయన పేరును కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పంజాబ్‌ ఇంఛార్జి హరీశ్‌ రావత్‌ కొత్త సీఎం పేరును వెల్లడించారు. కాంగ్రెస్‌ అధిష్టానం తన పేరును ప్రకటించడంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చరణ్‌జిత్‌ సింగ్‌ సన్నద్ధమయ్యారు. మరికొద్దిసేపట్లో ఆయన గవర్నర్‌ను కలవబోతున్నారు.

పీసీసీ అధ్యక్షుడు నవ్యజోత్‌ సిద్దూ, సీఎం అమరిందర్‌ సింగ్‌ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. అమరిందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ సాగింది. ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్న సుఖ్ఖిందర్‌ సింగ్‌ రణధావా పేరును ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పంజాబ్‌ సీఎంగా సుఖ్ఖిందర్‌ సింగ్‌ రణధావా పేరును ఏఐసీసీ ప్రకటించిందనే ప్రచారం జరిగింది. మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. అయితే అనూహ్యంగా రెండు గంటల్లోనే కాంగ్రెస్‌ పార్టీ చరణజిత్‌ సింగ్‌ చన్నీని నూతన సీఎంగా ప్రకటించింది.

చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కబోతున్నారు. రామ్‌దాసియా సింగ్‌ సామాజికవర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ.. చమ్‌కౌర్‌సాహెబ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చన్నీ.. 2015–16 మధ్య పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పని చేశారు. కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ కేబినెట్‌లో.. సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మెజారిటీ ఎమ్మెల్యేలు నాయకుడిగా ఎన్నుకున్నా.. సీఎం పదవికి దక్కకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు సుఖ్ఖిందర్‌ సింగ్‌ రణధావా. అధికార దాహంతో తాను లేనన్నారు. తనకు మద్ధతు తెలిపిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరిందర్‌ సింగ్‌ ప్రభుత్వంలో సుఖ్ఖిందర్‌ సింగ్‌ జైళ్ల శాఖ మంత్రిగా పని చేశారు.

Also Read : పంజాబ్ కొత్త సీఎం ఎవరు?