Idream media
Idream media
కేంద్రమైనా, రాష్ట్రాలైనా సంక్షేమ పథకాలు తప్పనిసరి. సంక్షేమ పథకాలు లేని ప్రభుత్వాన్ని ఊహించలేం. ఆయా ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారానే పార్టీలకు, ముఖ్యమంత్రులకు మంచిపేరు దక్కుతుంది. రెండు రూపాయలకే కిలో బియ్యం అనగానే ఎన్టీ రామారావు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్ అనగానే వైఎస్ రాజశేఖరరెడ్డి, అమ్మ క్యాంటీన్లు అనగానే జయలలిత గుర్తుకు వస్తారు. ఆయా పథకాలే వారికి మళ్లీ విజయాన్ని అందించాయి. ఇలాంటి ప్రజాధారణ పొందిన పథకాలే ఆయా పార్టీల ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారతాయి. ఇలానే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అమలు చేస్తున్న గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ ప్రజల్లో ఆ పార్టీకి మంచిపేరు తెచ్చిపెట్టింది. తన సామ్రాజ్యాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే లక్ష్యాలను పెట్టుకున్న ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఉచిత విద్యుత్ పథకాన్ని వజ్రాయుధంలా ప్రయోగిస్తున్నారు.
ఎక్కడకు వెళ్లినా.. కేజ్రీ నోట అదే మాట..
తన పథకాలతో కేజీవ్రాల్ ఢిల్లీ వాసుల మనసులను గెలుచుకున్నారు. మొదటిసారి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం పదిహేను నెలలే కొనసాగినా.. రెండోసారి భారీ మెజారిటీతో గెలిచారు కేజ్రీవాల్. పరిపాలనలో తనదైన మార్క్ వేశారు. ప్రభుత్వ విద్య, వైద్యంలో సమూల మార్పులు, మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ఢిల్లీని తన కంచుకోటగా మార్చుకున్నారు. ముచ్చటగా మూడోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. తన దృష్టిని ఇతర రాష్ట్రాలపై పెట్టారు.
Also Read : పాత్రికేయ విలువలు విడిచి విషం కక్కుతున్న కలం ఆంధ్రజ్యోతి
వచ్చే ఏడాదిలో గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్, పంజాబ్‌లలో పార్టీ కార్యకలాపాలను వేగీరం చేశారు. గుజరాత్, పంజాబ్ ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెడుతున్న కేజ్రీవాల్.. అదే సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇస్తున్నారు. ఢిల్లీలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తామని చెబుతున్నారు.
గ్యాప్ తీసుకుని వస్తున్న కేజ్రీవాల్..
ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ 2013లో తొలిసారి ఢిల్లీలో కాంగ్రెస్ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలను మట్టి కరిపించడంతో కేజ్రీవాల్ ఇమేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. అదే ఊపుతో ఆప్‌ను ఇతర రాష్ట్రాలలోనూ విస్తరించాలనే ప్రణాళికలను కేజ్రీవాల్ అమలు చేశారు. అయితే అవన్నీ విఫలమయ్యాయి. ఆప్ విస్తరణ ఆలోచనను పక్కనపెట్టిన కేజ్రీవాల్ పూర్తిగా ఢిల్లీపైనే ఫోకస్ పెట్టారు. 15 నెలలకే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఢిల్లీ ప్రజల మనసులను గెలుచుకున్నారు. 70 స్థానాలకు గాను 67 స్థానాలను గెలుచుకున్నారు. ఐదేళ్ల పాటు పాలనపై పూర్తిగా కేంద్రీకరించిన కేజ్రీవాల్.. మరోసారి ఢిల్లీ వాసుల మద్ధతును పొందారు. ఈ సారి 70 సీట్లకు గాను 62 చోట్ల జయకేతనం ఎగురవేశారు. ఢిల్లీలో ఆప్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కేజ్రీవాల్.. మరోసారి ఇతర రాష్ట్రాలపై పోకస్ పెట్టారు. ఢిల్లీలో తన పాలనను గుర్తు చేస్తూ.. అక్కడ అమలు చేసిన పథకాలను ఆయా రాష్ట్రాలలోనూ అమలు చేస్తామని హమీలు ఇస్తున్నారు. ఆప్‌ను విస్తరించాలని భావిస్తున్న కేజ్రీవాల్ ఈ సారైనా లక్ష్యం చేరుకుంటారా..? లేదా..? వేచి చూడాలి.
Also Read : కోమటిరెడ్డి.. ఒక్క రోజులో ఎంత మార్పు..?!