iDreamPost
iDreamPost
దేశంలో అత్యంత పురాతన పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని పొందే క్రమంలో తాను మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలో మొదటి నుంచి అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతులను కాదని సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుండటం ఈ అభిప్రాయాలకు తావిస్తోంది. ప్రస్తుత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీకి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం ఆ పార్టీ శ్రేణులనే విస్మయపరిచింది. తద్వారా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే చన్నీయే సీఎం అని పరోక్షంగా ప్రకటించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ విధంగా సీఎం పదవికి పోటీ పడుతున్న పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ ఆశలకు గండి కొట్టారని అంటున్నారు.
గతంలో ఒక్కసారే..
ఎంత పెద్ద నేతలనైనా ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయించడం కాంగ్రెసుకు ఇంతకుముందు అలవాటు లేదు. అలాగే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం కూడా లేదు. ఎన్నికల అనంతరం పరిస్థితులకు అనుగుణంగా సీఎం పేరును ఢిల్లీ నుంచి సూచించి లెజిస్లేచర్ పార్టీ ద్వారా ఎన్నుకునేలా చేయడం ఆ పార్టీకి అలవాటు. అయితే 2018 లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అప్పటి సీఎం సిద్ధరామయ్యకు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ అధిష్టానం కల్పించింది. ఆయన గతంలో ఐదుసార్లు నెగ్గిన మైసూర్ లోని చాముండేశ్వరి నగర్, బాదామి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే సొంత నియోజకవర్గంలో అనూహ్యంగా ఓటమిపాలై బాదామిలో స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ప్రస్తుత పంజాబ్ ఎన్నికల్లో సీఎం చన్నీకి మళ్లీ అటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ కల్పించింది. చన్నీ మూడుసార్లు వరుసగా నెగ్గిన చమకౌర్ తోపాటు మాల్వా ప్రాంతంలోని బధౌనీ నుంచి ఆయన్ను బరిలోకి దించింది.
Also Read : మీతో పొత్తా?దండం సార్..అమిత్ షా కు షాక్
సిద్ధూకు చెక్ పెట్టేందుకేనా?
వాస్తవానికి చన్నీని రెండు చోట్ల పోటీ చేయించాల్సిన అవసరం లేదు. చమకౌర్ ఆయన సొంత నియోజకవర్గం. దళిత ఓటర్లు అధికంగా ఉంటారు. చన్నీ కుటుంబానికి అక్కడ మంచి పట్టు ఉంది. గెలుపు నల్లేరు మీద నడకే. కానీ మరో దళిత నియోజకవర్గం బదౌనీలోనూ ఆయన్ను బరిలో దించడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. అక్కడ బలంగా ఉన్న ఆప్ ను దెబ్బకొట్టడం, దళిత ఓట్లు చీలిపోకుండా చూడటంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్న పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూకు చెక్ పెట్టడం, అలాగే సీఎం అభ్యర్థి చన్నీయేనని కార్యకర్తలకు సంకేతాలు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాను సీఎం అవుతానని అసమ్మతి నేత సిద్ధూ ఆశపడ్డారు. కానీ అధిష్టానం అనూహ్యంగా దళిత నేత చరణ్ జిత్ చన్నీని సీఎంను చేసింది. దాంతో అసంతృప్తికి గురైన సిద్ధూ చన్నీపైనా చిర్రుబుర్రులాడటం మొదలు పెట్టారు. అయితే తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కొత్త ప్రభుత్వంలో తానే సీఎం అవుతానని భావించారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కూడా జలంధర్ సభలో రాహుల్ పైనే ఒత్తిడి తెచ్చారు. సీఎం అభ్యర్థిని కార్యకర్తలు, ప్రజలే నిర్ణయిస్తారని చెప్పిన రాహుల్.. అసలు ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఉందా అన్న దానిపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పి తప్పించుకున్నారు.
అయితే సిద్దుపై అధిష్టానానికి అంత నమ్మకం లేదు. ఆయన దుందుడుకు తనం, మాటల జోరు వల్ల ఇబ్బంది పడతామన్న అభిప్రాయం ఉంది. పైగా పాకిస్తాన్ మద్దతుదారుడన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పదవి చేపట్టిన మూడు నెలల్లోనే సీఎం చన్నీ నిలదొక్కుకున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలు, నాయకుల మద్దతు సాధించారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం చన్నీ వైపే మొగ్గు చూపుతోంది. అయితే ఇప్పుడే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సిద్ధూ నుంచి ప్రతిఘటన ఎదురై ఎన్నికల్లో దెబ్బతింటామన్న ఉద్దేశంతో చన్నీకి పరోక్షంగా లైన్ క్లియర్ చేసినట్లు భావిస్తున్నారు.
Also Read : కాంగ్రెస్‌ను వీడిన రాంపూర్ నవాబుల కుటుంబం