Idream media
Idream media
భారత ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూని దేశవ్యాప్తంగా విజయవంతం చేశారు.దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ నిమిష నిమిషానికి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.
కానీ ప్రజలు లాక్‌డౌన్‌ను తేలిగ్గా తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు.దేశవ్యాప్తంగా పోలీసుల హెచ్చరికలను కూడా లెక్కచెయ్యకుండా ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్డు మీద సంచరిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయి కరోనా ప్రబలకుండా ఉండడానికి సోమవారం మధ్యాహ్నం పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రమంతటా కర్ఫ్యూ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.కరోనా కట్టడికి అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నా తొలి రాష్ట్రంగా దేశంలోనే పంజాబ్ నిలిచింది. కర్ఫ్యూ సమయంలో నిత్యవసర వస్తువుల కొనుగోలుకు కూడా ఎలాంటి మినహాయింపులు ఉండదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితిపై చీఫ్ సెక్రటరీ, డీజీపీతో సమావేశమై సమీక్షించారు.లాక్‌డౌన్‌ను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్నారని అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో ప్రజల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.ఇళ్ల నుంచి వాహనాలు కానీ, మనుషులు కానీ బయటకు రావొద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.కర్ఫ్యూ ఆదేశాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తామని పంజాబ్ సీఎం హెచ్చరిక చేశారు.