iDreamPost
android-app
ios-app

Power Politics – పంజాబ్‌లో ‘కరెంట్‌’ రాజకీయాలు

Power Politics – పంజాబ్‌లో ‘కరెంట్‌’ రాజకీయాలు

వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చిలో పంజాబ్‌ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ పంజాబ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నేతలు తమ కార్యాలయాలు వదిలి ప్రజల్లోకి వస్తున్నారు. ఎన్నికల్లో ఈసారి ‘కరెంట్‌’ రాజకీయాలు సాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంజాబ్‌ రాజకీయాలు విద్యుత్‌ ఛార్జీల చుట్టూ తిరుగుతున్నాయి.

పంజాబ్‌లో అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో మాదిరిగా గృహ అవసరాలకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఆప్‌ బాటలోనే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా పయనించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళిత సామాజికవర్గ నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ.. పేదలకు ఉచిత విద్యుత్, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 200 – 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తానని, త్వరలో జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని పేర్కొన్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీల హామీలు ఇలా ఉండగా.. విద్యుత్‌ పంపిణీ సంస్థలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. విద్యుత్‌బిల్లులు చెల్లించని వారి నివాసాలకు సరఫరాను అధికారులు నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో విద్యుత్‌ బిల్లులు చెల్లించని వారి ఇళ్లకు పవర్‌ కట్‌ చేశారు. ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించని కురళి నగరంలోని బస్తీల్లో ఉండే పేదల ఇళ్లకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసారు. ఈ విషయంపై స్థానికులు సీఎం చన్నీకి ఫిర్యాదు చేశారు. తమ ఇబ్బందులు మొరపెట్టుకున్నారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే.. సీఎం చన్నీ కదిలారు. బాధితుల నివాస ప్రాంతానికి వెళ్లారు. వారి బాధలను ఆలకించిన సీఎం.. స్వయంగా విద్యుత్‌ స్తంభం ఎక్కి.. సరఫరాను పునరుద్ధరించారు.

రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, ఈ సారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఆప్, మళ్లీ ఉనికి బలంగా చాటుకోవాలని శిరోమణి అకాలీదళ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అమరీందర్‌ సింగ్‌ స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన చన్నీని నియమించింది. పంజాబ్‌ చరిత్రలో చన్నీనే తొలి దళిత ముఖ్యమంత్రి. పదవి చేపట్టిన రోజునే.. కాంగ్రెస్‌పార్టీ సామాన్యులు, పేదల పార్టీ అని చెప్పారు చన్నీ. గత ఎన్నికల్లో లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీతో కలసి పోటీ చేసిన ఆప్‌ సొంతంగా 20 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ మూడు సీట్లు గెలుచుకుంది. ఈ సారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఆప్‌.. సొంతంగా అన్ని సీట్ల (117)లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

బీజేపీ – శిరోమణి అకాలీదళ్‌ కూటమి 18 సీట్లు గెలుచుకుంది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్‌ బీజేపీతో పొత్తును తెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి రైతుల మనన్ననలు పొందింది. బీజేపీ నామమాత్రంగా మిగిలింది. ప్రధానంగా కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళిదల్‌ మధ్య పోటీ జరగబోతోంది. ఏ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి వస్తుందో వచ్చే వేసవి ప్రారంభంలో తేలిపోతుంది.

Also Read : Punjab Congress Siddu – సీఎం ఎవరైనా.. సిద్ధూ తీరు అంతేనా?