iDreamPost
android-app
ios-app

అన్నాచెల్లెలు, తండ్రీకొడుకుల ఎమోష‌న్ పూల‌రంగ‌డు – Nostalgia

అన్నాచెల్లెలు, తండ్రీకొడుకుల ఎమోష‌న్ పూల‌రంగ‌డు – Nostalgia

పూల రంగ‌డు (1967) ఒక హిట్ సినిమా. దీనికి ఏజే. క్రొనిన్ రాసిన బియాండ్ దిస్ ప్లేస్ అనే న‌వ‌ల ఆధారం.

అస‌లు క‌థ ఏమంటే పాల్ అనే కుర్రాడు డిగ్రీ చ‌దివి టీచ‌ర్ కావాల‌నుకుంటాడు. అయితే అత‌ని తండ్రి ఒక హంత‌కుడ‌ని తెలుస్తుంది. త‌ల్లి ఆ విష‌యం దాచి అత‌న్ని పెంచుతుంది.

తండ్రిని చూడాల‌ని పాల్ అనుకుంటాడు. జైల్లోకి అనుమ‌తి లేదు. హ‌త్య కేసులోని సాక్ష్యులంద‌రినీ క‌లుస్తాడు. చివ‌రికి తండ్రి నిర్దోషి అని నిరూపిస్తాడు. ఈ క‌థ‌ని మ‌న‌కి అనుగుణంగా మార్చి 1955లో బెంగాల్‌లో “స‌బ‌ర్ ఉప‌రే” అని తీస్తే హిట్‌. త‌ర్వాత 58లో దేవ్ ఆనంద్ కాలాపాని తీస్తే హిట్‌. ఈ పాయింట్‌తోనే పూల‌రంగ‌డు సూప‌ర్‌హిట్‌.

ఒర్జిన‌ల్ క‌థ‌లో ఉన్న స‌స్పెన్స్‌ను తీసేసి అన్నాచెల్లెళ్ల ఎమోష‌న్‌గా మార్చేశారు. పూల‌రంగ‌డు అని టైటిల్ ముందే ఫిక్స్ చేసి క‌థ మీద కూచున్నారు. అంత‌కు మునుపు ANR కి నాలుగు ప్లాప్‌లున్నాయి. ఇది ఐదో ప్లాప్‌గా ప్ర‌చార‌మైంది. ANR సొంత సినిమా , హిట్ డైరెక్ట‌ర్ ఆదుర్తి సుబ్బారావు, ప్ర‌ముఖ ర‌చ‌యిత ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మ‌ణ క‌థ‌ని డెవ‌ల‌ప్ చేశారు. అయితే ఆయ‌న‌కి , ఆదుర్తికి మ‌ధ్య గొడ‌వ‌లొచ్చి మ‌ధ్య‌లో విజ‌య‌వాడ వెళ్లిపోయారు.

గొల్ల‌పూడి మారుతీరావు , య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి కూడా క‌థ మీద వ‌ర్క్ చేశారు. కానీ ఒక కొలిక్కి రాలేదు. చివ‌రికి ANRతో ఉన్న స్నేహం , మొహ‌మాటం కొద్ది ముళ్ల‌పూడి మ‌ళ్లీ జాయిన్ అయ్యాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి రంగ‌నాయ‌క‌మ్మ మాట‌లు రాశారు.

చివ‌ర్లో క్లైమాక్స్‌ని ఫిక్స్ చేయ‌డం క‌ష్ట‌మైంది. ఎన్టీఆర్ అయితే మారువేషం వేసి లాగించొచ్చు. ANRకి మారువేషాలు న‌ప్ప‌వు. అందుకే పంచ‌తంత్రం త‌ర‌హాలో విల‌న్ల మ‌ధ్య విభేదాలు సృష్టించి క‌థ‌ని సుఖాంతం చేశారు.

క్లుప్తంగా క‌థ ఏమంటే రంగ‌డు (ANR) జ‌ట్కా తోలుకుని జీవిస్తూ చెల్లెలు ప‌ద్మ‌ని (విజ‌య‌నిర్మ‌ల‌) చ‌దివిస్తూ ఉంటాడు. ప‌ద్మ ప్ర‌సాద్‌ని (శోభ‌న్‌బాబు) ప్రేమిస్తుంది. ఇద్ద‌రికి పెళ్లి జ‌రుగుతుంది. అయితే శోభ‌న్‌బాబు తండ్రిని హ‌త్య చేసింది ఎవ‌రో కాదు ANR తండ్రి నాగ‌య్యే అని తెలుస్తుంది. దాంతో ఆమె కాపురం దెబ్బ తింటుంది.

చెల్లెలిపై చాడీలు చెప్పిన చ‌లంని త‌న్న‌డంతో ANR జైలుకెళుతాడు. అక్క‌డ తండ్రిని క‌లిసి అత‌ను నేరం చేయ‌లేద‌ని తెలుసుకుంటాడు. చివ‌రికి తాను ప్రేమించిన జ‌మున‌తో క‌లిసి నాట‌కం ఆడి నిజం నిరూపిస్తాడు.

ఈ సినిమాలో ఒక పాట క‌ల‌ర్‌లో ఉంటుంది. అయితే యూట్యూబ్‌లో ఉన్న ప్రింట్‌లో అది లేదు. జైల్లో పాడే పాట కోసం మొద‌ట సెట్టింగ్ వేయాల‌నుకున్నారు. అయితే అప్పుడు జైళ్ల‌శాఖ చూస్తున్న PV న‌ర‌సింహారావు చంచ‌ల‌గూడ జైల్లో షూటింగ్‌ల‌కి ప‌ర్మీష‌న్ ఇచ్చారు.

కొస‌రాజు రాసిన “నీతికి నిల‌బడి నిజాయితీగా” పాట పెద్ద హిట్‌. ANR గుర్రం బండి తోలే సీన్స్ అన్నీ హైద‌రాబాద్‌లోనే తీశారు. అవి మ‌న‌మిప్పుడు గుర్తు ప‌ట్ట‌లేం. బేగంపేట రైల్వేస్టేష‌న్ ఒక ప‌ల్లెటూరిలా ఉంటుంది.

గుమ్మ‌డి విల‌న్‌గా వేశాడు. ప‌ద్మ‌నాభం క‌మెడియ‌న్. గీతాంజ‌లి జోడి. క‌థ‌లో పెద్ద మ‌లుపులుండ‌వు. కానీ హాయిగా సాగిపోతుంది. చివ‌ర్లో టేప్ రికార్డ‌ర్ సాయంతో నిజాన్ని నిరూపిస్తారు. ఆ రోజుల్లో టేప్ రికార్డ‌ర్ ఒక వింత‌. దాన్ని చూసిన వాళ్లెవ‌రూ లేరు. ధ‌న‌వంతుల ఇళ్ల‌లో మాత్ర‌మే ఉండేది. ఈ రోజు ఎవ‌రి ఇళ్ల‌లోనూ లేదు. అదే విచిత్రం.

హైద‌రాబాద్‌లో గుర్ర‌పు బళ్లు తిరిగే కాలం. త‌ర్వాత రిక్షాలొచ్చాయి. అవి మాయ‌మై కూడా పాతికేళ్లు దాటింది.

పూల‌రంగ‌డులో న‌టించిన వాళ్ల‌లో జ‌మున త‌ప్ప ఎవ‌రూ జీవించి లేక‌పోవ‌డం బాధాక‌రం.