iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్-డీఎంకే సీట్ల పంపిణీ పూర్తి

కాంగ్రెస్-డీఎంకే సీట్ల పంపిణీ పూర్తి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్-డీఎంకే ఒక కూటమిగా, ఎన్డీఏ మరో కూటమిగా బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని ఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది.

ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపిణీ పూర్తి కావడంతో కాంగ్రెస్-డీఎంకే మధ్య కూడా తాజాగా సీట్ల పంపిణీ పూర్తయింది. కూటమి సీట్ల పంపకంపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం కాంగ్రెస్,డీఎంకే మధ్య ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ 15, డీఎంకే 13, సీపీఐ 1, ఎల్టీడీ 1 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కాగా, ఎంపీ జగత్ రక్షన్ నేతృత్వంలోని డీఎంకే నేతలు.. ఏఐసీసీ ఇంచార్జి దినేష్ గుండూ రావుతో చర్చలు జరిపి పంపకంపై తుది నిర్ణయం తీసుకున్నారు.

ఎన్డీఏ కూటమిలో ఇలా...

పుదుచ్చేరిలో భాజపా మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం ఎట్టకేలకు పూర్తయింది. సుదీర్ఘ చర్చల అనంతరం.. రంగసామి నేతృత్వంలోని ఎన్ఆర్​ కాంగ్రెస్​, ఏఐఏడీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. ఎన్​ఆర్ కాంగ్రెస్​ 16 స్థానాల్లో.. ఏఐఏడీఎంకే, భాజపా కలిసి 14 స్థానాల్లో​ బరిలోకి దిగనున్నాయి. పుదుచ్చేరిలో ఎన్​ఆర్​ కాంగ్రెస్ పెద్దన్నగా వ్యవహరిస్తోందని బీజేపీ ఇప్పటికే వ్యాఖ్యానించింది. తద్వారా… మాజీ ముఖ్యమంత్రి రంగసామి.. ఎన్డీఏకి సీఎం అభ్యర్థి అని సంకేతాలిచ్చింది.

సర్వేలు ఏం చెప్తున్నాయి..?

30 స్థానాలు కలిగిన పుదుచ్చేరి అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ -డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమి 12 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇటీవల అక్కడ కాంగ్రెస్‌ నేత నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోవడంతో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి 18, యూపీఏ 12 స్థానాలు గెలుస్తాయని టైమ్స్‌నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కాగా, పుదుచ్చేరిలలో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.