iDreamPost
android-app
ios-app

యానాంలో సీఎంకి చెక్ పెట్టిన యువకుడు, మల్లాడి ఆశలు గల్లంతేనా?

  • Published May 02, 2021 | 7:59 AM Updated Updated May 02, 2021 | 7:59 AM
యానాంలో సీఎంకి చెక్ పెట్టిన యువకుడు, మల్లాడి ఆశలు గల్లంతేనా?

పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారం దిశలో సాగుతోంది. అన్నా డీఎంకే, బీజేపీలు ఎన్నార్ కాంగ్రెస్ తో కలిసి ఇక్కడ బరిలో దిగాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో పోటీ చేసి సానుకూల ఫలితాల దిశగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ 7 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా ఎన్డీయే అభ్యర్థులు మరో 4 చోట్ల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు రెండు చోట్ల విజయం సాధించగా మరో 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇండిపెండెంట్లు కూడా రెండు స్థానాల్లో ముందంజలో ఉండడం విశేషం.

మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం కోసం ప్రతీ సీటు కీలకం. ఒకటి రెండు సీట్ల తేడాతోనే అధికారం తారుమారవుతుంది. ఈ నేపథ్యంలోనే తుది ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే సీఎం అభ్యర్థిగా కూటమిని ముందుండి నడిపించిన ఎన్ రంగస్వామికి యానాం ఓటర్లు ఝలక్ ఇచ్చేలా కనిపిస్తోంది. మొత్తం 8 రౌండ్ల ఫలితాలకు గానూ 5 రౌండ్ల తర్వాత ఆయన 3వేల పైచిలుకు ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. యానాంతో పాటుగా ఆయన తన సొంత నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు. అక్కడ మాత్రం విజయం దిశలో సాగుతున్నారు.

యానాంలో మల్లాడి కృష్ణారావు బరిలో తప్పుకుని రంగస్వామికి మద్ధతు పలికారు. ప్రచార బాధ్యతను తన భుజాన వేసుకుని ప్రయత్నాలు చేశారు. కానీ ఓటర్లు మాత్రం భిన్నంగా ఆలోచించిట్టు కనిపిస్తోంది. యానాం ఫలితాలు పుదుచ్చేరి రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. గొల్లపల్లి అశోక్ చక్రవర్తి ఇండిపెండెంట్ గా యానాం నుంచి ముందంజలో ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్, సీపీఐ సహా వివిధ పక్షాలు మద్ధతు పలికాయి. 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత మల్లాడికి మొదటిసారి ఇది ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అయితే చివరికి విజయం తమనే వరిస్తుందని మల్లాడి వర్గం ఆశాభావంతో ఉంది.