iDreamPost
android-app
ios-app

తెరుచుకున్న థియేటర్ల ప్రోగ్రెస్ రిపోర్ట్

  • Published Oct 16, 2020 | 9:24 AM Updated Updated Oct 16, 2020 | 9:24 AM
తెరుచుకున్న థియేటర్ల ప్రోగ్రెస్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ల సందడి మొదలుకాలేదు కానీ మిగిలిన చోట్ల కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నిన్నటి నుంచి స్క్రీనింగులు మొదలు పెట్టారు. ఏడు నెలల తర్వాత తెరిచిన గేట్లు కావడంతో సిబ్బంది ఒకరకమైన భావోద్వేగానికి గురయ్యారు. ఇతర రాష్ట్రాల్లోనూ అధిక శాతం మల్టీ ప్లెక్సులు తీశారు తప్ప సింగల్ స్క్రీన్లు ఇంకా మూతబడి ఉన్నాయి. ఇక రెస్పాన్స్ విషయానికి వస్తే ఊహించినట్టే కలెక్షన్లు ఏమంత ఆశాజనకంగా లేవు. లాక్ డౌన్ కు ముందే దాదాపు అందరూ చూసినవి వేయడంతో పాటు ఇప్పటికే ఓటిటిలో అందుబాటులో ఉన్న సినిమాలు కావడంతో పబ్లిక్ అంతగా ఆసక్తి చూపలేదు.

గ్రేటర్ కైలాస్ లోని ఓ మల్టీ ప్లెక్సులో ఉదయం 11.30 షోకి కేవలం 5 టికెట్లే అమ్ముడుపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ కూడా చేశారు. కర్ణాటకలో అనుమతులు ఇచ్చినప్పటికీ ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో మినహాయించి అన్నీ మూసే ఉన్నాయి. కోల్కతా నగరంలో దీపావళి పూజా జరిపాక తెరిచేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. పివిఆర్ తనకున్న 845 స్క్రీన్లలో 487 ఓపెన్ చేసినట్టుగా సమాచారం. సినీపోలీస్, ఐనాక్స్ ఇవాళ నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టబోతున్నాయి. ఢిల్లీలోని కోవిడ్ యోధులకు,డాక్టర్లకు, ఆసుపత్రి సిబ్బందికి తప్పడ్ స్క్రీనింగ్ వేశారు. లజ్ పత్ నగర్ లో పివిఆర్ సిబ్బందికి షోలు ఏర్పాటు చేశారు.

మొత్తంగా ఇండియా వైడ్ చూసుకుంటే 8750 దాకా ఉన్న స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో 3100 మల్టీ ప్లెక్సులు కాగా 5650 సింగళీ స్క్రీన్లు. నిన్న ఈ రోజు కలిపి వీటిలో 30 శాతం కూడా తెరవలేదని ఓ ప్రాధమిక అంచనా. కొత్త కంటెంట్ వస్తే ఇన్ని జాగ్రత్తల మధ్య సినిమాలు చూసేందుకు జనం వస్తారన్న గట్టి నమ్మకం ట్రేడ్ లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చూసేసిన వాటిని అదే పనిగా సమయం, డబ్బు ఖర్చు పెట్టుకుని థియేటర్ కు వచ్చేందుకు పబ్లిక్ అంత సుముఖంగా లేరని వారి అభిప్రాయం. దసరాకు ఛాన్స్ లేదు కానీ దీపావళి నుంచి మాత్రం పరిస్థితిలో చాలా మెరుగైన మార్పును ఖచ్చితంగా చూడొచ్చని అంటున్నారు.