Movie Collections : ఇంత నీరసమైన శుక్రవారం మళ్ళీ రాదేమో

మొన్న శుక్రవారం చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు రిలీజైనప్పటికీ వసూళ్లు మాత్రం కనీస స్థాయిలో లేకపోవడం ట్రేడ్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెగటివ్ పబ్లిసిటీతో దారుణంగా ట్రోలింగ్ కి గురైన సన్ అఫ్ ఇండియా వీకెండ్ వల్ల కూడా పెద్దగా లాభపడలేక పోయింది. మొదటి రోజే చాలా చోట్ల షోలు రద్దు కావడంతో దాని స్థానంలో డీజే టిల్లు, ఖిలాడీలతో థియేటర్లు కలెక్షన్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేశాయి. అసలే అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు వర్జిన్ స్టోరీ, విశ్వక్, బాచ్ 1, స్వాతి చినుకు సందె వేళలో, సురభి 70ఎంఎం దేనికీ కనీస స్థాయిలో మౌత్ టాక్ కానీ థియేటర్ల సందడి కానీ లేకపోయింది.

పైన చెప్పిన సినిమాల గ్రాస్, షేర్ల గురించి మాట్లాడుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే లక్షల నుంచి వేలకు ఆ ఫిగర్లు పడిపోయి చాలా చోట్ల కనీసం హాళ్ల రెంటు కూడా గిట్టుబాటు చేసుకోలేనంత వీక్ గా డెఫిషిట్లు నమోదు చేసుకున్నాయి. ముందస్తు అగ్రిమెంట్లలో భాగంగా ఎక్కువ సెంటర్లలో బలవంతంగా లాగిస్తున్నారు కానీ ఇవాళ్టి నుంచి పరిస్థితి ఇంకా దిగజారబోతోంది. ఖిలాడీ అంత డిజాస్టర్ అయినా నిన్న కొన్ని చోట్ల డీసెంట్ కలెక్షన్లు రావడం గమనార్హం. ఇక డీజే టిల్లు సంగతి సరేసరి. ఆల్రెడీ లాభాల్లో ఉన్నప్పటికీ శని ఆదివారాలు అర్బన్ కేంద్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు వేయించుకోవడం ఒక్క దీనికి మాత్రమే సాధ్యమయ్యింది. లాభాలు గట్టిగా ఉన్నాయి.

ఇప్పుడీ నాలుగు రోజులు భారంగా గడిచిపోతే భీమ్లా నాయక్ వచ్చేస్తుంది. తెలంగాణలో బుక్ మై షోతో డిస్ట్రిబ్యూటర్ల రగడ కారణంగా ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోయినప్పటికీ అభిమానులు థియేటర్ల దగ్గరకు వెళ్లి టికెట్లు కొంటున్నారు. చాలా చోట్ల ఇప్పటికీ మొదటి రోజు అయిదారు ఆటలకు సంబంధించి మొత్తం సోల్డ్ అవుట్ కావడంతో బ్లాక్ మార్కెట్ దందా మొదలైపోయిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బెనిఫిట్ షోకు రెండు వేల దాకా ధర పలుకుతోందని అంటున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే మొదటి రోజు అన్ని చోట్ల సాధారణ ధరకు టికెట్ కొనడం కష్టమే. కాకపోతే ఏపిలో ఇలాంటి పరిస్థితి లేకపోవడం ఊరట కలిగించే అంశం

Also Read : Social Media Trolls : ఆన్ లైన్ వెక్కిరింతలకు గొళ్ళెం వేసేదెలా

Show comments