iDreamPost
android-app
ios-app

హాంగ్ మీద ప్రియాంక గాంధీ ఆశలు

హాంగ్ మీద ప్రియాంక గాంధీ ఆశలు

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాలు ఓ ఎత్తు. ఉత్తరప్రదేశ్‌ మరో ఎత్తు. బీజేపీ, కాంగ్రెస్‌, ఎస్పీ.. ఇలా పార్టీ ఏదైనా అన్నీ అదే తీరుగా ఆలోచిస్తున్నాయి. యూపీ అతిపెద్ద రాష్ట్రం కావడం ఓ ఎత్తయితే.. బీజేపీ ప్రతిష్ట అంతా అక్కడే ఉండడం మరో కారణం. ఎందుకంటే.. బీజేపీలో మోడీ, షాల తర్వాత యోగి ఆదిత్యానాథ్‌ ఆ స్థాయి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే.. ఇటీవలి కాలంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అక్కడ యోగి గెలుపు ఆసక్తిగా మారింది. సర్వేలన్నీ యోగికే పట్టం కడుతున్నా.. పశ్చిమ బెంగాల్‌ తరహా ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలూ లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, ఎస్పీ పట్టుబిగిస్తున్నాయి.

కాంగ్రెస్‌ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా, ఎస్పీ నుంచి అఖిలేష్‌ యాదవ్‌ తమ పార్టీల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి అవసరమైతే మద్దతు ఇస్తామని, ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రియాంకా వాద్రా గాంధీ అన్నారు. అయితే మహిళలు, యువకులకు కాంగ్రెస్‌ అజెండాను అమలు చేస్తామన్న షరతులకు ఎస్పీ ఒప్పుకోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఇంకో విషయం ఏంటంటే.. కాంగ్రెస్‌ నుంచి సీఎం అభ్యర్థి తానేనని ప్రకటించిన ఆమె మాట మార్చారు. తాను మాత్రమే సీఎం అభ్యర్థి కాదని వెల్లడించారు. ‘‘యూపీ సీఎం అభ్యర్థి నేనే అని చెప్పడం లేదు. ఆరోజు ఏదో చిరాకులో ఉన్నప్పుడు అలా ప్రకటించాను. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ మీడియా ప్రతినిధులు అదేపనిగా ప్రశ్నించడంతో నేను విసుగుచెందాను. యూపీలో ప్రతి చోటా నేనే కనబడుతున్నా. కాబట్టి సీఎం అభ్యర్థి నేను కాకుండా ఇంకెవరు అని ప్రకటించాల్సి వచ్చింది’’ అని ప్రియాంక చెప్పారు.

ప్రియాంక వ్యాఖ్యలకు మాయావతి కౌంటర్‌ ఇచ్చారు. యూపీలో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ పార్టీ సీఎం అభ్యర్థిని కొన్ని గంటల్లోనే మార్చడమే ఇందుకు నిదర్శనమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓట్లను కాంగ్రెస్‌కు వేసి వృథా చేయకుండా ఉంటే మంచిదని ట్విట్టర్ లో ఆమె పేర్కొన్నారు. బీజేపీపై పోరాడుతున్న విపక్షాల ఓట్లను కాంగ్రెస్‌ చీలుస్తోందని విమర్శించారు. అన్ని వర్గాలకూ అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలంటే బీజేపీని ఓడించి, బీఎస్పీకి అధికారం ఇవ్వాలని ఆమె కోరారు.