Idream media
Idream media
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు అతికినట్లు సరిపోతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు.. అధికారంలో లేనప్పుడు కూడా కూన రవికుమార్ తన నోటికి పని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన చిక్కులు ఎదుర్కొంటున్నారు. అధికారులను దూషించడం, బెదిరించిన వ్యవహారాల్లో పోలీసుల కేసులు ఎదుర్కొంటున్న కూన రవికుమార్.. కేసులు నమోదైన సమయంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఘటనలు ఇటీవల కాలంలో పలుమార్లు చోటు చేసుకున్నాయి.
మాటల్లో దూకుడు, ఆ పై అసభ్యపదజాలం వాడే కూన రవికుమార్ అధికారులను దూషించిన కేసుల్లో అరెస్ట్‌ల నుంచి తప్పించుకున్నా.. స్పీకర్ తమ్మినేని సీతారంపై చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. తమ్మినేని సీతారంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు, కూన రవికుమార్‌లు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ ఈ రోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అయితే తాను వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నానని, మరోసారి హాజరవుతానని అచ్చెం నాయుడు కమిటీకి తెలపగా.. కూన రవికుమార్ మాత్రం కమిటీ ఇచ్చిన నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ రోజు కమిటీ ముందు హాజరుకాలేదు.
పోలీసుల నుంచి తప్పించుకున్నట్లుగా.. ప్రివిలేజ్ కమిటీ విచారణ నుంచి తప్పించుకుందామనుకున్నారో ఏమో గానీ తాను వ్యవహరించిన తీరుతో కూన రవికుమార్ తనకు తానుగా చిక్కులు కొని తెచ్చుకున్నారు. నోటీసులకు స్పందించకపోవడం, విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ ధిక్కారంగా పరిగణించింది. విచారణకు హాజరుకాకపోవడంపై ముందుగానే సమాచారం ఇచ్చిన అచ్చెం నాయుడుకు మరో అవకాశం ఇచ్చేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి చైర్మన్‌గా గల ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. వచ్చే నెల 14వ తేదీన విచారణకు హాజరయ్యేలా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. కూన రవికుమార్ విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకునేందుకు నిర్ణయించింది. రవికుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకునేది నిర్ణయించి.. ఆ విషయాన్ని శాసన సభ ముందు ఉంచాలని కమిటీ తేల్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూన రవికుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అసెంబ్లీ నిర్ణయించే అవకాశం ఉంది.
Also Read : ఆయన పనిచేయరు.. ఇతరులను చేయనివ్వరు!మాడుగులలో పరిస్థితి ..