విజయవాడ నగర శివారులో ప్రయాణికులతో కూడిన బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ శివారు ప్రసాదంపాడు దగ్గరకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వెనుకభాగంలో మంటలు ఏర్పడినట్లు గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు మధ్యలో బస్సును నిలిపివేసి ప్రయాణికులను దింపివేశాడు.దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
బస్సులో అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దాంతో పోలీసులు స్థానికుల సహాయంతో రహదారి మధ్యలో నిలిచిన బస్సును రోడ్డు పక్కకు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మంటలు చెలరేగినట్లు మొదట్లోనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వ్యాఖ్యానించారు. బస్సు విజయవాడ శివారులో నిలిచిపోవడంతో వేర్వేరు వాహనాల ద్వారా ప్రయాణికులు విజయవాడకు చేరుకున్నారు.