Idream media
Idream media
ఫేస్‌బుక్‌లో దిశ అనే పత్రిక TRS పార్టీకి క్షమాపణలు చెప్పినట్టు పోస్టింగ్ చూసి నవ్వుకున్నాను. రిపోర్టర్‌కి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల బీజేపీని ఓడించండి అని వక్తలు అంటే పొరపాటున TRSని ఓడించండి అని రాశాడట. బీజేపీని ఓడించండి అని అర్థం చేసుకోడానికి ఇంగ్లీష్ ఎందుకు రావాలో?
ఇంగ్లీషే కాదు , ఏ భాషా రాని వాళ్లు రిపోర్టర్లు అవుతున్నారు. జర్నలిజం , భాష వేర్వేరు విషయాలు. ఒకసారి ఇంటర్వ్యూలో నీకు భాష తెలుసా అని ఒకాయన్ని అడిగితే తెలుసు సార్, బస్టాండ్ సెంటర్లో సోడాలు అమ్ముతాడని చెప్పాడు. ఆయన తర్వాతి రోజుల్లో ఒక పేమెంట్ పత్రికలో బ్యూరో ఇన్‌చార్జ్ కూడా అయ్యాడు.
పేమెంట్ పత్రికలంటే వాటిని మనం లీజుకు తీసుకోవచ్చు. నెలకి ఇంత అని డబ్బు కడితే ఒక ఎడిషన్ హక్కులు లభిస్తాయి. రిపోర్టర్లకి ఐడీ కార్డులు అమ్మి, యాడ్స్ తెచ్చుకుని , వీలైనప్పుడు పేపర్ ప్రింట్ చేసుకుని అమ్ముకోవచ్చు. బస్ పాసులు, రైల్వే పాస్‌లతో అవసరం ఉన్న వాళ్లు రిపోర్టర్ల కార్డులు కొంటారు.
పోలీస్ స్టేషన్లలో కార్డులు చూపించి పంచాయితీ చేస్తారు. వీళ్లని ఎవరైనా తంతే జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ కొన్ని సంఘాలు ధర్నాలు కూడా చేస్తాయి.
రిపోర్టర్లు, సబ్ఎడిటర్లలో జ్ఞానశూన్యత ఎపుడూ వుంది. ఇపుడు పతాక స్థాయిలో వుంది. మా బ్యాచ్‌లో ఒక పెద్దాయన వుండేవాడు. మంచి వాడే. కానీ చాదస్తం. ఒక రోజు బళ్లారి నుంచి వార్త వచ్చింది. ఎలుగుబంటి మహిళను ఎత్తుకెళ్లి సహజీవనం చేసిందట! మగాళ్లలో ఎలుగుబంట్లు వుంటాయని తెలుసు కానీ, ఎలుగు బంట్లు మగాళ్లలా మారడం తెలియదు. ఆ పెద్దాయన వార్తని అచ్చు వేయడానికి పూనుకున్నాడు. నేను అడ్డుకుని “మైండ్ దొబ్బిందా” అని అడిగాను.
దానికి ఆయన నొచ్చుకుని ఎలుగుబంట్లు ఈ రకంగా చేస్తాయని వాళ్ల వూళ్లలో జరిగిన సంఘటనలు చెప్పసాగాడు (పల్లెటూళ్లలో ఇలాంటి కథలు ఇప్పటికీ వున్నాయి). నేను ఆ వార్తను చించి చెత్తబుట్టలో వేశాను. ఆయన చాలా కాలం తన నమ్మకాన్ని లాజికల్‌గా వివరించే ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయన అసలు పేరు మరిచిపోయి ఎలుగుబంటి అని పిలిచేవాళ్లం (ఆయన పరోక్షంలో).
జర్నలిస్టుల్లో కూడా మహానుభావులుంటారు. జర్నలిస్టుల్లోనే వుంటారు. ప్రెస్‌మీట్‌కి వెళ్లే వరకూ కస్తూరి రంగన్ పురుషుడు అని తెలియని వాళ్లు. బాపూరమణ అంటే ఒకే వ్యక్తి అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
రిపోర్టర్లని తయారు చేసే కాలం పోయి, రిపోర్టింగ్‌ని కొనుక్కునే కాలం వచ్చి దశాబ్దాలు దాటింది.
ప్రింట్ మీడియాలో భాష అంటే సోడాలు అమ్మే వ్యక్తి కాదని తెలిసే అవకాశం ఉంది. టీవీలో అయితే మలయాళం , తమిళం, కన్నడం కలిపి రోటిపచ్చడి చేసి మాట్లాడినా ఎవరికీ ఏ అభ్యంతరం లేదు.