iDreamPost
iDreamPost
వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి ఆమె బడ్జెట్ సమర్పించారు. సాధారణంగా ఆర్థిక మంత్రులే బడ్జెట్ సమర్పిస్తారు. కానీ స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక మంత్రులు కాకుండా నేరుగా ప్రధాన మంత్రులే బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు సందర్భాలు ఉన్నాయి. అలా బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురూ కూడా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారే కావడం విశేషం. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతోపాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పీఎంలుగా ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి బడ్జెట్ సమర్పించాల్సి వచ్చింది.
కృష్ణమాచారి రాజీనామాతో నెహ్రూ
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్‌లో టీటీ కృష్ణమాచారి ఆర్థికమంత్రిగా ఉండేవారు. ముంద్రా కుంభకోణం కేసు వెలుగు చూడటంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో ప్రధానిగా ఉన్న నెహ్రూ స్వయంగా 1958లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది.
మొరార్జీ రాజీనామాతో ఇందిర
నెహ్రూ తదనంతరం ప్రధాని పదవికి మొరార్జీదేశాయ్ పోటీ పడ్డారు. చివరికి రాజీమార్గంగా ఆయనకు ఉప ప్రధాని పదవితో పాటు ఆర్థిక శాఖ కేటాయించి.. ఇందిర ప్రధాని అయ్యారు. అయితే 1969 జూలైలో బ్యాంకుల జాతీయీకరణ విషయంలో ఇందిర, మొరార్జీదేశాయ్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో ఆయన నుంచి ఆర్థిక శాఖను తొలగించిన ఇందిరా ఉప ప్రధాని పదవితోనే సరిపుచ్చారు. దాంతో మనస్తాపం చెందిన మొరార్జీ కేబినెట్ నుంచే వైదొలిగారు. ఫలితంగా 1970-71 బడ్జెట్ ను స్వయంగా పీఎం ఇందిరా సమర్పించారు.
వీపీ సింగ్ నిష్క్రమణతో రాజీవ్
ఇందిర తదనంతరం 1984 ఎన్నికల్లో గెలిచి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రిగా వీపీసింగ్ నియమితులయ్యారు. ఆయన హయాంలో బడా పారిశ్రామికవేత్తలపై ఈడీ దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులైన వారి నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అయితే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న వీపీసింగ్ ను మంత్రి పదవి నుంచి తొలగించడం కష్టమని భావించిన రాజీవ్ గాంధీ ఆయన్ను 1987 జనవరిలో ఆర్థిక శాఖ నుంచి మార్చి రక్షణ శాఖ అప్పగించారు. ఫలితంగా 1987-88 బడ్జెట్ ను పీఎం హోదాలో రాజీవ్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సమర్పణలో మొరార్జీదేశాయ్ రికార్డ్
కేంద్ర బడ్జెట్ల సమర్పణలో మొరార్జీ రికార్డ్ సృష్టించారు. నెహ్రూ, ఇందిర ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన 1962-69 మధ్య వరుసగా పది బడ్జెట్లు ప్రవేశపెట్టారు. వీటిలో రెండు మధ్యంతర బడ్జెట్లు ఉన్నాయి. ఆయన తర్వాత స్థానంలో పి.చిదంబరం ఉన్నారు. ఆయన 9 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా చెరో 8 సార్లు, కృష్ణమాచారి, మన్మోహన్ సింగులు చెరో ఆరుసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు.