Idream media
Idream media
దేశంలో కరోనా వికృత రూపం దాల్చుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ప్రధాని నరేంద్రమోదీని ఆకర్షించాయి. ఈ మేరకు ఆయన టెలిఫోన్ సంభాషణలో సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌కు చేసిన సూచనలు బాగున్నాయని, వాటిని వెంటనే అమలు చేస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. విపత్కర సమయంలో విలువైన సూచనలు అందించినందుకు సీఎం కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులను వివరించడానికి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారిని గుర్తించి టీకాలు వేయాలని సూచించారు. ముఖ్యంగా ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు, కార్మికులను గుర్తించి వారిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగానూ, లేదంటే ప్రత్యేక కేటగిరిగా గుర్తించి, వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. అనంతరం కేంద్ర మంత్రికి కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సూచనలపై హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ఇదే విషయం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రధాని మోడీతో ప్రత్యేకంగా చర్చించడం విశేషం.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆదివారం సమీక్ష నిర్వహించారు. సుమారు 50 వేల మంది డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషీయన్లు, ఫార్మాసిస్టులు, పారామెడికల్ సిబ్బందిని తాత్కాలికంగా వెంటనే నియమించుకోవాలని వారికి తగిన వేతనం చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఆసక్తి ఉన్నవారు వైద్యులు, ఇతర సిబ్బంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. అంతేకాదు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.