Idream media
Idream media
పులిట్జర్ గ్రహీత డానిష్ సిద్ధిఖి తాలిబన్ కాల్పుల్లో చనిపోయాడు. యుద్ధరంగంలో పనిచేసే విలేకరులు, ఫొటోగ్రాఫర్లకి ప్రమాదం ఎప్పుడూ వెంటే వుంటుంది. అయితే మన పత్రికల్లోని ఫొటోగ్రాఫర్లకి కూడా , పని ఒత్తిడి తక్కువేం కాదు. ఎంత కష్టపడినా ఫలితం మరీ తక్కువ.
88లో నేను ఆంధ్రజ్యోతి తిరుపతి ఎడిషన్‌లో చేరినప్పుడు పూర్ణచంద్రరావు ఫొటోగ్రాఫర్. పూర్ణా అని ప్రేమగా పిలిచేవాళ్లం. విపరీతమైన ఓపిక, సహనం. పెనం మాదిరుండే తిరుపతి ఎండల్లో తిరిగి ఫోటోలు తెచ్చేవాడు. తొలిరోజుల్లో బండి కూడా లేదు. తిరుపతి నుంచి ఆఫీస్ 5 కిలోమీటర్లు. అవస్థలు పడి వచ్చేవాడు. అప్పట్లో ముఖ్యమైనవి అదీ పగలు జరిగే ఈవెంట్స్ మాత్రమే కలర్ ఫోటోలు వచ్చేవి. ఎందుకంటే ఆ ఫోటోలని స్టూడియోలో డెవలప్ చేయించి ఎడిషన్ సెంటర్లో ముందుగా ఇవ్వాలి. అచ్చు వేయడానికి చాలా తతంగం ఉండేది.
ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ జరిగితే ల్యాబ్ వాళ్లను బతిమలాడి, 9కి మూసేయకుండా చూడాలి. లేటైతే ఆఫీస్ ల్యాండ్ లైన్‌కి ఫోన్ చేసి చంపుకు తినేవాళ్లు. సెల్‌ఫోన్లు లేవు కాబట్టి పూర్ణ ఎక్కడున్నాడో తెలిసేది కాదు. స్టూడియోకి చేరి ఫోన్ చేస్తే తప్ప ఫోటోల పరిస్థితి, అవి వస్తాయో లేదో కూడా తెలియని గందరగోళం. అక్కడ ప్రింట్స్ వేసుకుని ఆఫీస్ జీపులో వచ్చేవాడు. తర్వాత ఫోటోల సెలక్షన్, రైటప్‌ల పని. టైం లేకపోవడం వల్ల ఏదో ఒక తప్పు జరిగేది. తెల్లారితే విచారణలు. వీఐపీల ప్రోగ్రామ్స్‌లో ఫొటోగ్రాపర్స్‌కి రాత్రిపూట పస్తులే.
బ్రహ్మాత్సవాలు జరిగితే రాత్రి 9 గంటలకి వాహన సేవ ఫోటోలు తీసుకుని ఘాట్‌రోడ్డు దిగేవాడు. కనీసం రిలీవర్ కూడా లేనికాలం. ఇక రెగ్యులర్‌గా అయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే. రోజూ రాత్రి ఆఫీస్‌కి వచ్చి ఫోటోలని డార్క్ రూమ్‌లో కడిగి ఇచ్చేవాడు. 92లో పూర్ణకి తోడుగా జవహర్ వచ్చాడు. మనిషి మంచోడు కానీ ఒకటే వాగుడు.
ఒకసారి గోవిందరాజస్వామి గుడి ఏనుగుని నడిపే మావటిపై ఫీచర్ చేద్దామని అతని ఇంటిని వెతుక్కుంటూ నేనూ, జవహర్ వెళ్లాం. మావటి ఇల్లు అంటే ఏదో చిన్న పెంకుటిల్లుగా మా ఊహల్లో వుంది. కానీ మర్రిమాను వీధిలోని ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంది. హాల్లో సోపాలు, కలర్ టీవీ, ఫ్రిజ్ (92లో అవి ఎంత ఖరీదంటే మధ్య తరగతి వాళ్లు కూడా కొనలేని స్థితి) అవన్నీ చూసి జవహర్ ఆశ్చర్యపోయాడు. మా ఇంట్లో నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు, బ్లాక్ అండ్ వైట్ టీవీ వుండేది. జవహర్ ఇంట్లో రెండే కుర్చీలు. టీవీ లేదు. 1500 రూపాయల మిక్సీని నెలకు 150 రూపాయల ఇన్‌స్టాల్‌మెంట్‌తో జర్నలిస్టులు కొనేరోజులు. ఇప్పటికీ పెద్ద మారిందేమీ లేదు.
పత్రికలు ఎదిగాయి కానీ, జర్నలిస్టులని ఎదక్కుండా యాజమాన్యాలు ముద్దుగా చూసుకుంటాయి. సరే, ఇదే వేరే విషయం. మావటి దగ్గరికొద్దాం. లోపలున్న మావటి భయంగా, ఆందోళనగా చూశాడు. ఏనుగు తొండంతో భక్తులకి ఆశీర్వాదం ఇచ్చి డబ్బులు వసూలు చేసే భయం, ఇది మాకు తెలియదు. ఒక్కొక్కరు రూపాయి ఇచ్చినా సీజన్‌లో గోవిందరాజస్వామి ఆలయానికి వేల భక్తులు వస్తారు.
మెల్లగా అతన్ని మాటల్లో పెడదామనుకున్నా. అతని ఇల్లు , డబ్బు మా సబ్జెక్టు కాదు. ఏనుగుతో అతనికున్న అనుబంధం మాకు కావాల్సింది. అయితే జవహర్ వాగుడు కదా, వెంటనే “భలే ఉందన్నా మీ ఇల్లు, సొంతమేనా, ఏందబ్బా నీ ఆదాయం” అన్నాడు. మావటిలో భయం.
“ఎవరు మీరు?” అని అడిగాడు.
“ఆంధ్రజ్యోతి నుంచి వచ్చాం. ఏనుగుని నువ్వెలా నడుపుతావో ఇంటర్వ్యూ కావాలి”
“బస్సుని డ్రైవర్ నడిపినట్టే, నేను ఏనుగుని నడిపేది. అయినా అవన్నీ మీకెందుకు? ముందు మీరు పదండి” అని గెటౌట్ చెప్పాడు.
“అది కాదన్నా” అని ఏదో చెప్పబోతే..
“ఏంది కిండలా (ఎగతాళి), ఇదిగో అబ్బా , ఫోటో తీస్తే మర్యాదుండదు. నేను మంచోన్ని కాదు, అరే శీనా (ఎవర్నో పిలిచాడు) ఈళ్లెవరో సూడు ఎకసెక్కాలుగా ఉండారు” దాదాపుగా గెంటేశాడు.
జవహర్‌ని మించిన వాగుడుకాయ సత్యనారాయణబాబు. నేను కడప ఇన్‌చార్జ్‌గా ఉన్నపుడు ఫొటోగ్రాఫర్. ఇతనికి లెక్కలు రావు. అందుకే కొన్ని లక్షల ఫోటోలు తీశానని చెప్తూ వుండేవాడు. వాటిలో శవాలే ఎక్కువ.
ఇతనితో కలిసి బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. పీఠాధిపతి (ఈ మధ్య పోయారు) గౌరవంగా ఆహ్వానించి బ్రహ్మంగారి కాలజ్ఞానం తాటాకుల గ్రంధాన్ని చూపించి వివరిస్తుండగా ఆ ఆకుల్ని పరిశీలించి
“స్వామి ఈ కాల జ్ఞానం ఒర్జినల్లా, డూప్లికేటా?” అన్నాడు.
అసలే పీఠాధిపతి, కాలింది.
“మీరు ఆంధ్రజ్యోతి అని ఏం గ్యారెంటీ, డూప్లికేట్ కావచ్చు కదా” అని లోపలికి వెళ్లిపోయాడు. ఆయన్ని బుజ్జగించి దారికి తెచ్చుకోడానికి బ్రహ్మం స్వామి కనిపించాడు.
తిరుపతిలో తర్వాత నాకు బాగా ఇష్టులు సుబ్రమణ్యం, గిరిబాబు. సుబ్బు ఆంధ్రజ్యోతిలో కొలీగ్. హైలీ ప్రొఫెషనల్. ఫోటో కోసం ఎంత కష్టమైనా పడతాడు. ఒకసారి అర్ధరాత్రి బావిలో 9 శవాలున్నాయంటే, నేను, సుబ్బు జీపులో వెళ్లాం. 9 మంది ఆడవాళ్లు. నాకు దుక్కం వచ్చింది. ఎవరో ఏమో? ఎంత కష్టం వచ్చిందో?
సుబ్బు సీరియస్‌గా ఫోటోలు ఎలా తీయాలో ఆలోచిస్తున్నాడు. లైటింగ్ లేదు. ప్లాష్ చాలదు. బ్లాక్ అండ్ వైట్ కాలం. ముల్ల కంపలు దాటుకుని జీపు వస్తే హెడ్‌లైట్స్ వెలుతురులో తీయొచ్చు. టైర్ పంక్చర్ అవుతుందని డ్రైవర్ భయం. అదే జరిగితే ఇన్‌టైమ్‌లో వెనక్కి వెళ్లలేం. ఇపుడైతే ఫోన్‌లో వార్త చెప్పి, వాట్సప్‌లో ఫోటోస్ పంపొచ్చు. టెక్నాలజీ ఇంత ఎదుగుతుందని కూడా తెలియని కాలం. చివరికి జీపుని రప్పించి ఫోటోలు తీశాం. సుబ్బులో ఎమోషన్ లేదు. ఫోటో వచ్చిందా లేదా అదే అతని ఆలోచన.
ఇంకోసారి రాగి పంటని పండించే రైతులు వింత వ్యాధితో బాధపడుతున్నారని కుప్పంకి బైక్‌లో నేనూ, సుబ్బూ వెళ్లాం. అది అంటువ్యాధి. మాక్కూడా రావచ్చు. ఫోటో కోసం రిస్క్ తీసుకునే లక్షణం అందరు ఫొటోగ్రాఫర్లకి వుంటుంది. భయపడరు.
సుబ్బు సాక్షిలో కూడా కలిసి చేశాడు. గిరిబాబుతో వ్యక్తిగత పరిచయం ఉన్నా, సాక్షిలోనే కలిసి పనిచేయడం. ఒక దృశ్యాన్ని అందంగా ఫోటో తీయడం గిరికి తెలుసు. సెన్సిటివ్ ఫోటోలు ఆయన బైలైన్‌తో సాక్షిలో వేశాం. నేను రాసిన చాలా ఫీచర్స్‌కి ఇతనే ఫోటోలు తీశాడు.
చిరంజీవి పార్టీ సభ తిరుపతిలో జరిగింది. భయంకరమైన ట్రాఫిక్ జామ్‌లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇన్‌టైంలో గిరి ఫోటోలు అందజేశాడు. గిరి చక్కటి ఫేస్‌బుక్ రచయిత. మంచి తెలుగు రాస్తాడు.
పూర్ణ ఇప్పుడు హిందూలో ఉన్నాడు. జవహర్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నాడు. సుబ్బు గవర్నమెంట్ ఫొటోగ్రాఫర్. బాబు కడపలో ఒక ఈవెనింగ్ డైలీ పెట్టి తనకు నచ్చని రిపోర్టర్లు, అధికారుల మీద ఉతికి ఆరేశాడు. ఇప్పటి సంగతి తెలియదు. గిరిబాబు వృత్తిలో అలసిపోయి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు.
వీళ్లకి అవార్డులు రాకపోవచ్చు. సరైన గుర్తింపు కూడా లేకపోవచ్చు. కానీ వృత్తిలో వీళ్లు చూపిన తెగువ, సాహసం, కష్టం సామాన్యమైంది కాదు. వార్తలు ఏదో రకంగా తెలుసుకుని రాయొచ్చు. కానీ ఫోటోలు తీస్తేనే వస్తాయి. ఇంత కష్టపడితే గొప్ప జీతాలేమీ రావు. గొర్రె తోక పొడవెంతో అందరికీ తెలుసు. ఫోటోలు రాకపోతే దండనలు వుంటాయి కానీ, గొప్ప ఫోటోలకి అభినందనలు తక్కువే.
కెమెరాతో అద్భుతాలు చేస్తే సరిపోదు. పైవాళ్ల గుడ్‌లుక్స్ వుండాలి. లేదంటే వేధింపులు, బదిలీలు.
మనలో కళ ఉంటే చాలదు. దాన్ని గుర్తు పట్టి గౌరవించే వాళ్లు కూడా ఉండాలి. ఇప్పుడు అసలు సమస్య అదే.