iDreamPost
android-app
ios-app

రేపటి నుంచి విశాఖలో ఫ్లీట్ రివ్యూలు.. వీటిని ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..?

  • Published Feb 20, 2022 | 12:06 PM Updated Updated Feb 20, 2022 | 12:06 PM
రేపటి నుంచి విశాఖలో ఫ్లీట్ రివ్యూలు.. వీటిని ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..?

సాగర నగరం విశాఖపట్నం సుదీర్ఘమైన నౌకాదళ పండుగకు సిద్ధం అయ్యింది. భారత నావికాదళం యుద్ధ సన్నద్ధతను, ప్రతిభాసంపత్తులను చాటి చెప్పే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, ఆ వెంటనే విదేశీ నౌకాదళాలు కూడా పాల్గొనే మిలన్-22 విన్యాసాలకు విశాఖ తీరం వేదిక కానుంది. సోమవారం ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరగనుండగా.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నగరానికి చేరుకున్నారు. దీని తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే ఈ నెల 25 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు మిలన్-22 విన్యాసాలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఫ్లీట్ రివ్యూ, మిలన్ అంటే ఏమిటి? ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు..? ఈసారి వీటి నిర్వహణ విశేషాలు ఏమిటన్నది ఆసక్తికరం.

నౌకాదళ సామర్థ్య సమీక్ష

నేవల్ ఫ్లీట్ రివ్యూ అంటే నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించడం. ఇవి రెండు రకాలు. మొదటిది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) కాగా రెండోది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. అంతర్జాతీయ స్థాయిలో నావికాదళాలు కలిగిన దేశాలన్నీ కలిసి నిర్వహించే విన్యాసాలను ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటారు. సభ్య దేశాల ప్రతిభా సామర్థ్యాలను సమీక్షించడం, సాంకేతిక నైపుణ్యాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం దీని లక్ష్యం. మన దేశంలో రెండుసార్లు ఐఎఫ్ఆర్ లు జరిగాయి. 2001లో ముంబైలో జరగ్గా 15 ఏళ్ల తర్వాత 2016లో విశాఖలో నిర్వహించారు. విశాఖ ఐఎఫ్ఆర్ లో 22 దేశాలు పాల్గొన్నాయి.

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్)

రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ మన దేశ నౌకాదళ శక్తి సామర్థ్యాలను త్రివిధ దళాల అధిపతి అయిన రాష్ట్రపతి సమీక్షించే కార్యక్రమం. భారత నావికాదళం, దాని అనుబంధ విభాగాలన్నీ ఇందులో పాల్గొని తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తాయి. స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు 11 పీఎఫ్ఆర్ లు జరిగాయి.

1953లో నిర్వహించిన తొలి ఫ్లీట్ రివ్యూలో భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖ నిర్వహిస్తున్న ఫ్లీట్ రివ్యూకు ఒక ప్రత్యేకత ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంలో ఈ ఫ్లీట్ రివ్యూను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నేవీ, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ విభాగాలకు చెందిన 60 యుద్ధ నౌకలు, పదివేలమంది సిబ్బంది పాల్గొంటారు.

సోమవారం జరిగే కార్యక్రమంలో యుద్ధ నౌకలను తీరంలో నాలుగు వరుసల్లో నిలబెడతారు. ప్రెసిడెన్షియల్ యాచ్ లో పయనిస్తూ వాటిని రాష్ట్రపతి పరిశీలిస్తారు. ప్రెసిడెన్షియల్ యాచ్ గా ఉపయోగించేందుకు ఐఎన్ఎస్ సుమిత్ర నౌకను ముస్తాబు చేశారు. అనంతరం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు విన్యాసాలు నిర్వహిస్తాయి. బోట్ల కవాతు ఉంటుంది. అనంతరం ప్రత్యేక పోస్టల్ కవర్, ప్రత్యేక స్టాంపును రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 

25 నుంచి మిలన్-22

ఫ్లీట్ రివ్యూ ముగిసిన మూడురోజుల తర్వాత ఈ నెల 25 నుంచి మిలన్-22 విన్యాసాలు ప్రారంభం అవుతాయి. ఇరుగు పొరుగు మిత్ర దేశాల మధ్య యుద్ధ నైపుణ్యం, సాంకేతికత మార్పిడి లక్ష్యంగా మిలన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1995లో తొలిసారి దీనికి శ్రీకారం చుట్టారు. అప్పుడు కేవలం నాలుగు దేశాలు ఆ విన్యాసాల్లో పాల్గొనగా.. ప్రస్తుతం విశాఖలో నిర్వహించే మిలన్ లో 45 దేశాలు పాల్గొంటుండటం విశేషం. 50కిపైగా యుద్ధనౌకలు విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నెల 25 నుంచే ఈ విన్యాసాలు ప్రారంభం కానున్నప్పటికీ 26న ప్రారంభ వేడుకలు జరుగుతాయి. 27న బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్, 25 నుంచి 28 వరకు హార్బర్ దశ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు సముద్ర అంతర్భాగంలో విన్యాసాలు జరుగుతాయి. నాలుగో తేదీన ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.

Also Read : అప్పుడు వస్తుంటే ఆపారు..! ఇప్పుడు పిలిచినా రాలేదు..!!