దేశమంతా ‘ప్రేమ’మయం – Nostalgia

(24 ఏళ్ళ క్రితం వచ్చిన మ్యూజికల్ లవ్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమ దేశం’ గురించి ఆ సమయంలో పదో తరగతి పూర్తి చేసుకున్న ఓ సినిమా అభిమాని జ్ఞాపక తరంగం)

“రేయ్ ప్లీజ్ రా. ఎలాగైనా ఇప్పించరా. నీకు దండం పెడతా.నువ్వేం అడిగినా చేస్తాను. ఇది అయ్యాక మళ్ళీ నిన్నేమి అడగను ప్రామిస్”

అప్పటికది పదో పన్నెండోసారో మా వాసుగాడిని బతిమాలుకోవడం. వారం నుంచి నిద్రపట్టడం లేదు. ఎలాగైనా చూసి తీరాలి. వచ్చి రెండు వారాలు దాటేసింది. ఒక్కొక్కళ్ళు ఐదారుసార్లు చూశామని గొప్పలు చెబుతుంటే నా తల తీసి మున్సిపల్ గ్రౌండ్ లో కాలేజీ స్టూడెంట్స్ ఫుట్ బాల్ ఆడుతున్నంత అవమానంగా ఉండేది.

1996 సంవత్సరం …..

ప్రేమదేశం చూడని యువకులను బ్యాన్ చేయాలనే రేంజ్ లో దాని గురించిన చర్చలతోనే క్లాస్ రూములు హోరెత్తిపోయేవి. మూడుసార్లు థియేటర్ కు వెళ్లి వెనక్కు వచ్చా. టికెట్ కోసం ఆ గుంపులో దూరితే బయటికి వచ్చేలోపు నాకు నేను యోగి వేమన గెటప్ లో కనిపించి ఉస్సూరని వెనక్కు వచ్చేవాడిని. అప్పుడే తెలిసింది వాసు గాడికి సినిమా హాల్ లో ఎవరో పరిచయమని దానివల్లే పదిసార్లు పూర్తిచేశాడని. అందుకే ఈ బ్రతిమాలే ప్రోగ్రామ్.

డేట్ మర్చిపోయా కానీ ఎట్టకేలకు ఓ సుమూహూర్తంలో వాడు చెప్పిన టైంకి హీరో రేంజర్ సైకిల్ వేసుకుని బయలుదేరా. ఇంటర్ మీడియట్ లో అడుగుపెట్టిన తొలి రోజులు. పెడల్ మీద కాలు వేసి తొక్కుకుంటూ వెళ్తుంటే ఏదో పుష్పక విమానం మీద ఫ్రీగా స్కై డ్రైవ్ కు వెళ్లినంత ఆనందం. దారిపొడుగునా ఎక్కడ ప్రేమదేశం పోస్టర్ కనిపించినా మారికాసేపట్లో దాన్ని చూడబోతున్న గర్వంతో నాకు తెలియకుండానే కాలర్ కాస్త పైకి ఎగరడం ఇంకా గుర్తే.

థియేటర్ వచ్చేసింది. మూడు స్క్రీన్లున్న కాంప్లెక్స్ లో దీన్ని మినీ ద్వారకా అనే చిన్న హాల్లో వేశారు. టికెట్ల కోసం కొట్టుకుంటున్న జనాన్ని చూపించి అప్పుడే ఎదురొచ్చిన వాసుగాడి ఫేస్ లో ఓ రకమైన ఫీలింగ్ చూసావా మన లెవిలు అనేలా. సరే అపొజిషన్ టైం బాగున్నప్పుడు మనకు అనాకారి కూడా అందగత్తెలా కనిపిస్తుంది. అలా అలా లోపలికి ఎంటరయ్యాం. షో మొదలైంది.

“ప్రేమదేశం”

ఆత్రంలో నాకు మాత్రం ఆ టైటిల్ స్వర్గలోకంలా కనిపించింది. చూస్తున్నంత సేపూ ఎక్కువసేపు కన్నార్పలేకపోయానని ఖచ్చితంగా చెప్పగలను. ఒక లవ్ స్టొరీని ఇంత భారీగా తీయొచ్చా. తమిళ్ లో కదిర్ అనే దర్శకుడిలో ఇన్ని గొప్ప ఆలోచనలు ఉన్నాయా. రెహమాన్ సంగీతం ఇంత మాయ చేస్తుందా. ముస్తఫా ముస్తఫా పాటకు ఒక్కడంటే ఒక్కడు సీట్లో లేడు. పూనకాలు, ఈలలు, గోలలు, అరుపులు ఒకటా రెండా. ఆ పాట చివరి షాట్ లో సినిమా హాల్ లో ఒక్కసారిగా స్టూడెంట్స్ చేతుల్లో వెలిగించిన క్యాండిల్స్. ఎక్కడి నుంచి వచ్చాయా అని చూస్తే అందరూ లోపలికి రాకముందే జేబుల్లో పెట్టుకుని వచ్చారు. నా జీవితంలో అలాంటి సీన్ చూడటం అదే ఫస్ట్ అదే లాస్ట్.

టబును చూస్తున్నంత సేపు మనను ఏదోలా ఉంది. ఇంటర్ తొలి రోజుల్లోనే నాలో కవికి మొలకలు స్టార్టయ్యాయి. చిన్న చిన్న కవితలతో ఫ్రెండ్స్ ని విసిగించడం అప్పటికే పాకిపోయింది. వినీత్ ని చూసాక కవిత్వంతో టబు లాంటి అందగత్తెని ప్రేమలో పడేయొచ్చన్న నమ్మకం కలిగాక ఆరోజు రాత్రి ఏకబికిన ఐదారు కవితలు రాసినట్టు గుర్తు. ఇలా చెప్పుకుంటూ పోతే నా జ్ఞాపకాలకు పద్దు ఈ సోదికి హద్దు ఉండదు కానీ క్లైమాక్స్ కు వచ్చేస్తా

ఇద్దరు ఇమేజ్ లేని కుర్రాళ్లతో ముగింపు లేని ప్రేమ….

దర్శకుడిని నమ్మి కొత్త హీరోల మీద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాత…

సినిమా మొత్తం మీద పావు గంట కంటే ఎక్కువ కనిపించని విలన్….

ఐదారు నెలల పాటు ఇందులోని పాటలే లోకంగా యువత ఊగిపోయేలా చేసిన సంగీతం….

కాలేజీ కుర్రాళ్ళు అమ్మాయిలు తండోపతండాలుగా థియేటర్లకు కదిలివచ్చే అరుదైన ట్రెండ్….

అబ్బాస్ క్రాఫ్ కోసమే సెలూన్ల ముందు క్యూ కట్టిన బ్యాచులు….

ఎన్నో ఎన్నెన్నో ప్రవాహం ఆగేలా లేదు కానీ….

దర్శకుడు రెహమాన్, నిర్మాత కుంజుమోన్, దర్శకుడు కదిర్ ఈ మూడు పేర్లు ఏళ్ళ తరబడి వెంటాడుతూనే వచ్చాయి……

చివరి మాట

ఈ ప్రేమదేశం పుణ్యమా అని ఫ్రెండ్ ని లవర్ గా యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్న అమ్మాయిలు ఇందులో చూపించిన క్లైమాక్స్ ప్రభావం వల్ల ప్రేమికుడికి ఫ్రెండ్ షిప్ స్టాంప్ వేసి వదిలించుకున్న వాళ్ళ లెక్క ఒక్కో ఊరిలో వేలల్లోనే…

ఎందరో ప్రేమికులు….ఘాడంగా ప్రేమించి చివరికి స్నేహితులుగా మిగిలిపోయిన అందరికీ ఈ ఆర్టికల్ అంకితం….

సర్వే యువతా ప్రేమో భవంతు….

Show comments