iDreamPost
android-app
ios-app

చర్చల వైపు అడుగులు పడ్డాయ్‌

చర్చల వైపు అడుగులు పడ్డాయ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్‌సీ వ్యవహారంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయలు తొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పీఆర్‌సీ వల్ల జీతాలు తగ్గుతాయని ఉద్యోగ సంఘాల నేతలు, ఏ ఒక్కరి జీతం తగ్గదని, పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నాయి. పీఆర్‌సీ వద్దని, పాత పీఆర్‌సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు, కొత్త పీఆర్‌సీ ప్రకారమే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో.. ప్రతిష్ఠంభన నెలకొంది. పీఆర్‌సీపై ఉద్యోగుల అనుమానాలు, అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలు సహా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

చర్చలకు రావాలని కమిటీ ఆహ్వానించినా.. నిన్నటి వరకు ఉద్యోగ సంఘాలతో కూడిన పీఆర్‌సీ సాధన సమితి నేతలు ససేమిరా అన్నారు. పీఆర్‌సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను వినిపించారు. అప్పటి వరకు చర్చలకు వచ్చేది లేదన్నారు. పలుమార్లు కమిటీ చర్చలకు పిలిచినా ససేమిరా అన్నారు. సమ్మె చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. అయితే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, వారి ప్రయోజనాల పట్ల ఆది నుంచి సానుకూలంగా ఉండడం, నిన్న పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేయడం, హైదరాబాద్‌ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచడం వంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగ సంఘాలు కొంత మెత్తబడ్డాయి.

చర్చలకు రావాల్సిందిగా కమిటీ కూడా రాతపూర్వకంగా ఉద్యోగ సంఘాలను ఆహ్వానించడంతో.. ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో కూడిన పీఆర్‌సీ సాధన సమితి నేతలు మంత్రులు కమిటీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉద్యోగులు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, జనవరి నెల జీతాలు విడుదలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Also Read : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త