iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్టీలకు వేర్వేరు అధ్యక్షులు ఉన్నారు కాని అన్నింటికీ అసలైన అధ్యక్షుడు చంద్రబాబే అని, ఆయన దిశా నిర్దేశంలోనే అవి పనిచేస్తాయని పదే పదే రుజువవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రజల కోసం ఏ సంక్షేమ పథకం అమలు చేసినా దానిపై ఎలా స్పందించాలన్నది చంద్రబాబు మైండ్‌లో ఫిక్స్ అయితే మిగిలిన పార్టీలు బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నాయి. ఈ విషయం ఇప్పటికి చాలాసార్లు రుజువైంది.
పేదల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులు, సంక్షేమ పథకాల అమలు ఇలా అంశం ఏదైనా టీడీపీ లైన్‌ను అనుసరిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించింది అని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఒక వదంతిని వ్యాపింపజేస్తే సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అదే పాయింట్‌కు విస్తృత ప్రచారం కల్పించారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కూడా అదే అబద్ధాన్ని వల్లించేశారు. ఆయన గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలను భయపెట్టి, పీఆర్సీ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి నీరుగార్చారని ఆరోపించేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఢిల్లీ వెళ్లి చెప్పామని వెల్లడించారు.
ఎలా భయపెట్టిందట?
ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను భయపెట్టింది అంటున్న విపక్షనేతలు ఎలా భయపెట్టిందో వివరిస్తే బావుండేది. వారి పీకలపై కత్తులు పెట్టిందా? కణతలకు తుపాకీలు గురిపెట్టిందా? అధికార పక్షంపై అసూయతో రగిలిపోతున్న చంద్రబాబు చేసే విమర్శల్లో నిజానిజాలు నిర్ధారించుకోకుండా వాటినే మిగిలిన పార్టీల నేతలు రిపీట్ చేయడం శోచనీయమని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. మెజార్టీ సంఖ్యలో ఉద్యోగ సంఘ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మె యోచన విరమించారు. ఉపాధ్యాయ సంఘనేతల్లో కొందరిని పావులుగా చేసుకొని ఉద్యోగుల ఉద్యమాన్ని ఎలాగైనా కొనసాగించాలని టీడీపీ ప్రయత్నిస్తోందని, కానీ అది సాధ్యం కాదని చెబుతున్నారు. అయినా ప్రతిపక్షాలు అన్ని కలిసి ఉద్యోగులను బెదిరించారని చెబుతున్నా ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు వారి ప్రచారాన్ని ధ్రువీకరించలేదని అధికార పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకొంటూ ఒక ప్రాంతీయ పార్టీ చేసే విమర్శలను రిపీట్ చేయడానికి బీజేపీ నాయకులకు చిన్నతనం అనిపించడం లేదా అని అడుగుతున్నారు.
ఎవరి చెవిలో చెప్పారో..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఢిల్లీ వెళ్లి చెప్పామని అంటున్న విష్ణుకుమార్ రాజు ఎవరిచెవిలో చెప్పారో వెల్లడించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి పైబడి ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఆందోళన చేస్తుంటే తీరుబడిగా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయవద్దని ఢిల్లీ వెళ్లి చెప్పామని అంటున్నారే కాని ఎవరికి చెప్పారో కూడా వెల్లడించలేని దుస్థితిలో ఉన్నారా? ఎవరికి చెప్పారు? ప్రధానికా, హోంమంత్రికా, పరిశ్రమల మంత్రికా అని ప్రశ్నిస్తున్నారు. సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి ప్రకటనలు ఇస్తే స్టీల్‌ప్లాంట్ కార్మికులు బీజేపీ నేతలను నమ్ముతారా? అన్నది వారు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : ఏపీ ఉద్యోగులను సజ్జల బెదిరించారట!