ప్రశాంత్ కిషోర్ ఆపరేషన్ ఢిల్లీ షురూ

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో పార్టీకి సేవలు అందించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పార్టీలన్నింటినీ అధికారంలోకి తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అదే బీజేపీకి వ్యతిరేకంగా బీహార్‌లో జేడీయూ వ్యూహకర్తగా పనిచేసి జేడీయూని అధికారంలోకి తీసుకొచ్చారు.

ఆ తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ తరుపున కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం పనిచేశాడు. అమరీందర్ సింగ్ సర్కార్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి ఆయన పని చేస్తున్నారు.

తాజాగా ఆయన మరో పార్టీకి వ్యూహకర్తగా పని చేసేందుకు సిద్దమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం ఆయన పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు. ప్రశాంత్ కిశోర్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ తమతో కలసి పని చేయబోతోందన్న విషయాన్ని అందిరితోనూ పంచుకోవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ప్రజా ఉద్యమాలతో సామాన్యుడిగా వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొద్ది నెలల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పీకేను కేజ్రివాల్ వ్యూహకర్తగా నియమించుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రివాల్ 2012 నవంబర్ 26 న స్ధాపించబడింది. 2013ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసి మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి ఆప్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

ట్రిపుల్ తలాక్, జమ్ము కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, ఉగ్రవాద నిరోధక చట్టం వంటి చట్టాలను అమలు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలతో దసూకుపోతున్న ప్రధాని మోదీ ప్రభంజనాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, ప్రశాంత్ కిశోర్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

Show comments