iDreamPost
android-app
ios-app

Prashant Kishor, TMC, Karnataka – కన్నడనాట కాంగ్రెస్‌ని ‘పీకే’ సే లక్ష్యం నెరవేరుతుందా..?

Prashant Kishor, TMC, Karnataka – కన్నడనాట కాంగ్రెస్‌ని ‘పీకే’ సే లక్ష్యం నెరవేరుతుందా..?

ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నాయకుడిగా మారి హస్తం పార్టీ ద్వారా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని అనుకున్నాడు ప్రశాంత్‌ కిశోర్‌. కాంగ్రెస్‌లో కీలక స్థానం ఆశించిన పీకే..పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యత మొత్తం తనకి అప్పగించాలన్న షరతు విధించి కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో భంగపడ్డాడు.తాను ఆశించిన పదవి కాంగ్రెస్‌ కట్ట పెట్టలేదని కసితో పీకే రగిలి పోతున్నాడు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని నేలమట్టం చేసి దాని పునాదులపై తృణమూల్ కాంగ్రెస్‌ని నిర్మించే పనిలో పడ్డాడు.

దేశవ్యాప్తంగా తృణమూల్‌ని విస్తరించే బాధ్యత చేపట్టిన పీకే సాధారణ ఎన్నికలకు ముందు 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై గురిపెట్టాడు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ దుకాణాన్ని మూయించిన ప్రశాంత్‌ కిశోర్‌ చూపు తాజాగా దక్షిణాది రాష్ట్రాలపై పడింది.కాంగ్రెస్ బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీని ‘పీకే’సి టీఎంసీ శాఖని ఏర్పాటు చేసేందుకు బెంగళూరులో కాలుమోపాడు.

మొన్న గోవా..నిన్న మేఘాలయ..రేపు కర్ణాటక అంటూ ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌కు ఉన్న అవకాశాలకు మోకాలడ్డు పెడుతున్నాడు. గురువారం తాను కలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల జాబితాతో బెంగళూరులో పీకే వాలిపోయాడు. ప్రస్తుతం కన్నడనాట కాంగ్రెస్‌లో ఉన్న వర్గ పోరును ఉపయోగించుకోవాలని పీకే వ్యూహం రచించినట్లు అర్థమవుతోంది. లింగాయత్‌ సామాజికవర్గం నుంచి గట్టి మద్దతు ఉన్న ఎంబీ పాటిల్‌పై వల విసిరాడు. కర్ణాటకలో టీఎంసీకి ఎంబీ పాటిల్ నాయకత్వం వహించాలని ప్రశాంత్ కిషోర్ కోరుకుంటున్నారు.కానీ ఎంబీ పాటిల్ పార్టీకి విధేయత ప్రకటిస్తూ ప్రశాంత్‌ కిశోర్‌ని కలవడానికి ఇష్టపడక, ఫోన్‌లో మాత్రం మాట్లాడాడు.తృణమూల్‌లో చేరతారా అని అడగగా పీకే ఆఫర్‌ను ఆయన తిరస్కరించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక కర్ణాటక హస్తం పార్టీలో సిద్ధరామయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఎంబీ పాటిల్, డీకే శివకుమార్, సతీష్ జార్కిహోళి, డాక్టర్ జీ పరమేశ్వర బలమైన పోటీదారులు.పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు దక్కకుండా ఉండేందుకు మాజీ సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు.ఒకవేళ సిద్ధరామయ్య సీఎం రేసు నుండి వైదొలిగితే ఎంబీ పాటిల్‌, సతీష్‌ జార్కిహోళీలకు ఆయన మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.

తాజాగా కర్ణాటక శాసన మండలిలో విపక్ష నేత ఎస్‌ఆర్‌ పాటిల్‌, సీనియర్‌ నేత ప్రతాప్‌ చంద్రశెట్టి వంటి కాంగ్రెస్‌ పెద్దలకు మండలి ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కలేదు. కానీ రాజకీయ నేపథ్యం లేని ‘స్క్రాప్ బాబు’ గా పేరుగాంచిన యూసుఫ్ షరీఫ్ వంటి కొత్త సభ్యులు టిక్కెట్ పొందగలిగారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌తో చాలా మందికి విభేదాలు ఉండగా మరికొందరు సిద్ధరామయ్య వైఖరిపట్ల అసంతృప్తిగా ఉన్నారు.ఇక బీజేపీ యడ్యూరప్పని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత లింగాయత్‌ సామాజికవర్గం కూడా రాజకీయంగా దిక్కుతోచని స్థితిలో పడింది.ఇకమీదట తమ సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేత సీఎం కాలేడని లింగాయత్‌లు అసంతృప్తికి గురైయ్యారు.

సరిగ్గా ఈ అంశాలని పసిగట్టిన పీకే ఆ సామాజిక వర్గ నేతలపై గురిపెట్టాడు.కాంగ్రెస్ నుండి కనీసం ఐదుగురు పెద్ద నాయకులను తృణమూల్‌లో చేర్చుకోవడంతోపాటు క్రియాశీలకంగా లేని మరింత మంది నాయకులను గుర్తించడంపై పీకే ప్రధానంగా దృష్టి సారించారు.అలాగే రాజకీయంగా తటస్థంగా ఉన్న నాయకుల జాబితాను కూడా ఆయన రూపొందించుకొని వారితో మంతనాలు మొదలెట్టాడు.

2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌ను ఖాళీచేసి టీఎంసీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న పీకే ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయో వేచి చూడాలి.