iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ కిషోర్ -టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై పీకే టీం రిపోర్ట్..

ప్రశాంత్ కిషోర్ -టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై పీకే టీం రిపోర్ట్..

తెలంగాణలో బీజేపీ చేస్తున్న హ‌డావిడిని నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆ మేర‌కు ఆయ‌న కూడా అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్దం చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు బీజేపీని నిలువ‌రించ‌డంతో పాటు.. టీఆర్‌ఎస్‌ను బ‌లోపేతం చేసేందుకు చేయాల్సింది చేస్తున్నారు. కేసీఆర్ ఏ విష‌యాన్నీ అంత తేలిగ్గా న‌మ్మ‌రు. ప‌క్కా ఆధారాలు, రిపోర్టుల‌ను ప‌రిశీలించాకే త‌గిన నిర్ణ‌యాలు తీసుకుంటారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. గ‌త రెండు ప‌ర్యాయాల‌కు, ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాల్లో చాలామార్పులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో సాధార‌ణ ఎత్తుగ‌డ‌లు ప‌నిచేయ‌వ‌ని ముందే గుర్తించిన కేసీఆర్ పార్టీలోని నేత‌ల వ్య‌క్తిగ‌త మైలేజీపై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

నిఘా సంస్థల నివేదికలు, వివిధ సర్వేల ద్వారా పరిస్థితిని మదింపు చేస్తూనే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు. విపక్షాలు చేస్తున్న హడావుడి రాష్ట్ర రాజకీయాలపై ఎంత మేర ప్రభావం చూపుతుంది? పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా? అనే కోణంలో లెక్కలు కడుతున్నారు. చాలాచోట్ల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షాలకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. కాగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అధినేత కేసీఆర్‌కు వివిధ రూపాల్లో నివేదికలు చేరుతుండటంతో పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. సర్వేల నిర్వహణకు ప్రశాంత్‌ కిషోర్‌ బృందంతో టీఆర్‌ఎస్‌ కలిసి ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ టీం ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కేసీఆర్ ఓ అంచ‌నాకు రానున్నారు.

పీకే టీం రిపోర్టులోని అంశాలు?

ముగ్గురు మంత్రులు స్థానిక వివాదాల్లో తలదూర్చడం, ఓ మంత్రి తన జిల్లాలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయ పరచడంలో విఫలం కావడాన్ని పీకే టీం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌గా వారిపై ఆయ‌న‌ సీరియస్ అయిన‌ట్లు తెలిసింది. ఖమ్మం జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒకే స్థానానికి పరిమితం కావడం, వలసలు ప్రోత్సహించినా పార్టీ పరిస్థితి మెరుగు కాకపోవడానికి గల కారణాలపై సర్వే ద్వారా వివరాలు రాబడుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వలస వచ్చిన చోట పాత,కొత్త నేతల నడుమ తీవ్రమైన సమన్వయలోపం ఉన్నట్లు గుర్తించారు. తాండూరు, నకిరేకల్, కొల్లాపూర్‌ వంటి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలో చాలాచోట్ల ఈ తరహా పరిస్థితి ఉన్నట్లు తేలింది. ఆదిలాబాద్‌లో ఒకటి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో రెండు, నల్గొండలో మూడు, రంగారెడ్డిలో నాలుగేసి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇప్పుడు..?

తెలంగాణ అసెంబ్లీ స్థానాలు మొత్తం 119 . గ‌త ఎన్నిక‌ల్లో ఐదుగురికి మినహా మిగిలిన టికెట్ల‌న్నీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ఇచ్చి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ నిర్ణ‌యం ఫ‌లితాన్ని ఇచ్చింది కూడా. చెప్పిన‌ట్లుగానే ఒక్క‌టి త‌క్కువ సెంచ‌రీ కొట్టేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 103 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో 65 మందికి పైగా ఎమ్మెల్యేలు వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 మందికి పైగా సభ్యులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే.. ఈసారి టికెట్ల కేటాయింపులో వ్యూహం మార్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో యువత, కొత్తవారికి పెద్దపీట వేసేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.