iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ తొలి అడుగు – Nostalgia

  • Published Sep 22, 2021 | 10:25 AM Updated Updated Sep 22, 2021 | 10:25 AM
మెగాస్టార్ తొలి అడుగు – Nostalgia

శిఖరమంత మెగాస్టార్ అనే ఇమేజ్ చిరంజీవికి ఒక్క సినిమాకో ఒక్క ఏడాదిలోనో రాలేదు. దాని వెనుక సంవత్సరాల కష్టం ఉంది. ఎన్నో జయాలు అపజయాలు చూస్తూ ఎగుడుదిగుడుల ప్రయాణం చేశాకే ఎవరెస్ట్ శిఖరం లాంటి సింహాసనం దక్కింది. ఎంత పెద్ద స్టార్ అయినా తెరమీద విడుదలైన మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. సరిగ్గా ఇదే రోజు 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి అనే నటుడి చిత్రం మొదటిసారి సిల్వర్ స్క్రీన్ ను పలకరించింది. అదే ప్రాణం ఖరీదు. దర్శకుడిగా కె వాసుకి ఇది రెండో మూవీ. సిఎస్ రావు కథ మాటలు అందించిన ఈ గ్రామీణ నేపధ్యానికి ఒకరకంగా చెప్పాలంటే సాహసోపేతమైన సబ్జెక్టునే ఎంచుకున్నారు.

ప్రాణం ఖరీదు సినిమా స్వాతంత్రం రాకముందు ఒక పల్లెటూరు నేపథ్యంగా సాగుతుంది. గ్రామాల్లో దొరల దాష్టికత్వానికి బలవుతున్న పేదల ఘోషను ఇందులో చూపించారు వాసు. దానికి తగ్గట్టే అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా లొకేషన్లు, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రమోహన్, జయసుధ, రావు గోపాల్ రావు, చలం, రమాప్రభ, నూతన్ ప్రసాద్, సత్యనారాయణ, మాధవి లాంటి సీనియర్లు ఉన్న సినిమాలో తానేంటో ప్రూవ్ చేసుకుంటే తిరుగుండదని గుర్తించిన చిరంజీవి దీనికోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ మొత్తం నెలన్నరలో రాజమండ్రి పరిసర ఊళ్ళలో పూర్తి చేశారు. ఒక పాట మాత్రం మదరాసులో షూట్ చేశారు. కోట శ్రీనివాసరావు మొదటిసారి తెరమీద కనిపించింది కూడా ఇందులోనే. రేష్మిని చిరుకి జోడిగా తీసుకున్నారు.

ప్రాణం ఖరీదు ప్రీమియర్లను ఇండస్ట్రీ పెద్దలకు చూపించారు నిర్మాత క్రాంతి కుమార్. బాగుందన్నారు కానీ గొప్పగా ఎవరూ పొగడలేదు. రిలీజయ్యాక అదే జరిగింది. కమర్షియల్ గా సినిమా ఫ్లాప్. కె వాసు టేకింగ్, కథలో నిజాయితి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఒక రోజు ముందు విడుదలైన కృష్ణ చెప్పింది చేస్తా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించగా తర్వాత వచ్చిన మరో కలర్ స్కోప్ సినిమా శివరంజని ధాటికి దీన్నెవరూ పట్టించుకోలేదు. బ్లాక్ అండ్ వైట్ లో తీయడం కూడా కొంత మైనస్ అయ్యింది. ఒక సీన్లో చిరంజీవిని కొడుతున్న రావుగోపాల్ రావు ప్రత్యేకంగా కళ్ళను, కసితో కూడిన యాక్టింగ్ ని చూసి ఈ కుర్రాడెవరని ప్రత్యేకంగా ఎంక్వయిరీ చేశారట. ఫలితం మాట ఎలా ఉన్న ప్రాణం ఖరీదు చిరు కెరీర్ కి ఒక బలమైన పునాదిగా నిలిచి ఇప్పటికీ చెరిగిపోని ప్రభతో వెలిగిపోయేలా చేసింది

Also Read : కొన్ని సినిమా పాఠాలు చాలా ఖరీదు – Nostalgia